సంక్రాంతికి వస్తాడని...

26 Dec, 2014 01:06 IST|Sakshi
సంక్రాంతికి వస్తాడని...

కుమారుడి రాక కోసం ఎదురుచూస్తుండగా మృతి వార్త
కుప్పకూలిన తల్లిదండ్రులు
మృతుడు గౌహతి ఐఐటీ విద్యార్థి..
ఉరివేసుకొని హాస్టల్‌లో ఆత్మహత్య
చిన్నతనం నుంచి చదువులో రాణింపు

కె.కోటపాడు: ‘అమ్మా.. నాన్నా.. సంక్రాంతి పండగకు వస్తా..’ అని సంతోషంగా చెప్పిన కొన్ని గంటలకే కొడుకు చావు వార్త వినాల్సి వస్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉండరు.  త్వరలో చదువు పూర్తవుతుందని, విదేశాల్లో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం ఫోన్ రావడంతో కుప్పకూలిపోయారు. కె.కోటపాడు గ్రామానికి చెందిన కాకి పరమేశ్వరరావు (22) అస్సాం రాష్ట్రం, గౌహతి ఐఐటీలో బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
 
అక్కడ ఏ కష్టమొచ్చిందో ఏమో  గురువారం  కళాశాల  హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరమేశ్వరరావు ఉదయం నుండి హాస్టల్ గదిలో నుండి బయటకు రాకపోవడంతో అనుమానించిన స్నేహితులు  తలుపుకొట్టినా తెరవలేదు. దీంతో వారు వెంటిలేటర్ నుండి చూడగా ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులకు  సమాచారాన్ని అక్కడ నుండి ఫోన్‌లో హిందీలో తెలపడంతో  తల్లి పార్వతికి అర్ధం కాలేదు.  కాసేపటికి ఇంటికి వచ్చిన భర్త వెంకటరావుకు హిందీలో ఎవరో   ఫోన్ చేశారని చెప్పింది. ఆయన కళాశాలకు తిరిగి ఫోన్ చేయగా కుమారుడు మృతి చెందాడని  తెలియడంతో కుప్పకూలారు.
 
చదువుల్లో ఎప్పుడూ ప్రథమమే
పరమేశ్వరరావు చిన్నప్పటినుండి చదువులో ఎప్పుడూ ఫస్టే. కె.కోటపాడు వేణు విద్యానికేతన్‌లో 5 వరకు చదివి కొమ్మాది నవోదయలో సీటు సాధించి అక్కడ చేరాడు. అక్కడ 10వ తరగతి పరిక్షల్లో 94.6శాతం మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలిచాడు. తరువాత విశాఖపట్నం శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివి 950 మార్కులతో ఉత్తీర్ణత సాధించి గౌహతి ఐఐటీలో సీటు పొందాడు. అక్కడ బి.టెక్ (మెకానికల్)   పైనల్ ఇయర్ చదువుతున్నాడు.
 
అక్క పెళ్లికి వచ్చాడు
పరమేశ్వరరావు ఈ ఏడాది మార్చిలో జరిగిన అక్క లక్ష్మి వివాహానికి వచ్చి  తిరిగి కళాశాలకు వెళ్లిపోయాడు. సంక్రాంతి పండగకు జనవరి 9న వస్తానంటూ తల్లి దండ్రులకు బుధవారమే ఫోన్ చేసి చెప్పాడు.  అంతలోనే తమ ఒక్కగానొక కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో  తల్లి దండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వీరికి మొత్తం ముగ్గురు సంతానం. పెద్దమ్మాయికి వివాహం కాగా, చిన్నమ్మాయి యమున రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది.

మరిన్ని వార్తలు