అక్రమ కట్టడాల కూల్చివేత

23 Aug, 2013 02:54 IST|Sakshi

కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : కాగజ్‌నగర్ పట్టణంలో గురువారం అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో ప్రధాన రహదారుల వెంబడి ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని బల్దియూ అధికారులు గతంలో వ్యాపారులకు పలుమార్లు నోటీసులు అందించినా వారు ఆక్రమణలను తొలగించలేదు. దీంతో గురువారం సాయంత్రం మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ బాలాజీ దిగంబర్ మంజూలే సమక్షంలో సిబ్బంది జేసీబీ సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు.
 
 ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆక్రమణలను కూల్చడంపై పలువురు వ్యాపారులు నిరసన తెలిపారు. గతంలోనే నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతోనే తొలగిస్తున్నామని మున్సిపల్ అధికారులు బదులిచ్చారు. దీంతో అధికారులు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం తలెత్తి ఉద్రిక్తతకు దారితీసింది. డీఎస్పీ సురేశ్‌బాబు, టౌన్ ఎస్‌హెచ్‌వో పృథ్వీధర్‌రావు జోక్యంచేసుకుని వ్యాపారులను సముదారుుంచారు. విషయం తెలిసి ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అక్కడికి చేరుకుని వ్యాపారులతో మాట్లాడారు.
 
 అకస్మాత్తుగా దుకాణ సముదాయూల ఎదుట ఉన్న షెడ్లను తొలగిస్తే తాము నష్టపోతామని వ్యాపారులు ఆయనకు విన్నవించారు. జేసీబీపైకి ఎక్కి తొలగింపు ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఎమ్మెల్యే సబ్‌కలెక్టర్‌తో మాట్లాడి ఆక్రమణల తొలగింపునకు గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు సబ్‌కలెక్టర్ అంగీకరించకపోవడంతో సుమారు గంటసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే వెళ్లిపోవడంతో అధికారులు తొలగింపు ప్రక్రియను రాత్రి వరకూ కొనసాగించారు. రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి తీరందాజ్ టాకీసు పరిసర ప్రాంతాలతోపాటు ఆర్పీ రోడ్ వరకు ఇరువైపులా ఉన్న ఆక్రమ కట్టడాలను తొలగించారు. కార్యక్రమంలో తహశీల్దార్ మల్లేశ్, టీపీబీవో ఖాజాషరీఫ్, డీఈ కృష్ణలాల్, మేనేజర్ మల్లిఖార్జునస్వామి, ఆర్‌ఐ ముస్తఫా, ఆర్వో అంజయ్య, రూరల్ ఎస్సై తిరుపతి, ఏఎస్సైలు రాజేశ్వర్, మోహన్‌ప్రసాద్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు