మన్యంపై సారా రక్కసి..

21 Jan, 2019 07:24 IST|Sakshi
లేవలేని స్థితిలో ఉన్న భర్తపై నీళ్లు చల్లుతున్న గిరిజన మహిళ, పిల్లలు

సాలూరు, పాచిపెంట మండలాల్లో సారా తయారీ, విక్రయాలు

ఛిద్రమవుతున్న గిరిజనుల బతుకులు

ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేపడుతున్నా కానరాని ఫలితం

విజయనగరం, సాలూరు రూరల్‌: జాతీయ రహదారి 26 పక్కనే ఉన్న పాచిపెంట మండలం పనసలపాడు కంకరరోడ్డుపై  ఓ మహిళ  హృదయ విదారకరంగా రోదిస్తుంది. ఏమైందని చూస్తే సారా తాగి ఆమె భర్త రోడ్డుపై పడి ఉన్నాడు. మత్తులో ఉన్న తన భర్తను ఇంటికి తీసుకెళ్లేందుకు ఆ మహిళ ఎంతో కష్టపడింది. 

జాతీయ రహదారి 26 పాచిపెంట మండలంలోని పి.కోనవలస పంచాయతీ గంగన్నదొరవలస గ్రామ సమీపంలో తాగిన మత్తులో జాతీయ రహదారికి ఆనుకుని ఇద్దరు గిరిపుత్రులు పడి ఉన్నారు. జాతీయ రహదారి కావడంతో వందలాది వాహనాలు అధిక వేగంతో రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఏ వాహనమైనా వారిమీద నుంచి వెళ్లిపోతుందోనని స్థానికులు భయపడి వారిని పక్కకు తీశారు. ఇటువంటి సంఘటనలో సాలూరు, పాచిపెంటతో పాటు మన్యం ప్రాంతాల్లో నిత్యం మనకు కనిపిస్తుంటాయి. మద్యానికి బానిసైన యువత పరిస్థితి తెలుసుకునేందకు పై  రెండు సంఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే.

కూలి సొమ్ము తాగుడుకే..
 రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. గిరిజనులందరూ రోజంతా కష్టపడి వచ్చిన డబ్బుతో మద్యం తాగుతున్నారు. సాధారణ మద్యం ధరల కంటే మన్యంలో తయారయ్యే సారా తక్కువ ధరకు వస్తుండడంతో ఎక్కువ మంది సారా వైపే ఆకర్షితులవుతున్నారు. పాచిపెంట  మండలంలోని పి.కోనవలస పరిసర ప్రాంతాల్లో.. సాలూరు మండలంలో కురుకూటి, నార్లవలస, తోణాం, కందులపధం, పరిసర ప్రాంతాల్లో సారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

కుటుంబాలు చిన్నాభిన్నం..
సారాకు బానిసలు కావడంతో గిరిజనుల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. భర్త కూలి డబ్బులతో ఇంటికి వస్తాడని ఎదురు చేసే భార్యకు.. ఎక్కడో రోడ్డు పక్కన పడి ఉన్నాడనే సమాచారం వస్తే ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వెంటనే పిల్లలను తోడు తీసుకుని భర్తను వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితి. ఇలా ఎంతోమంది మహిళలు రోజూ తమ భర్తల కోసం రోడ్ల వెంబడి వెతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటే సారా విక్రయాలు ఎంత జోరుగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

– మరణానికి చేరువవుతున్నా...
ఇదిలా ఉంటే మత్తు త్వరగా ఎక్కేందుకు గాను సారా తయారీలో కెమికల్స్‌ ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీని వల్ల  ఆరోగ్యం చెడిపోయి యువత మృత్యువాత పడుతున్నారు. సారా తయారీకి ఉపయోగించే బెల్లం, అమ్మోనియా, తదతర సరుకులను అటు సాలూరు ఇటు ఒడిశా నుంచి తీసుకువస్తున్నట్లు సమాచారం.బ్యాటరీ పౌడర్, యూరియా, నల్లబెల్లం తదితర  సామాగ్రితో తయారు చేస్తున్న సారా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. 30, 40 సంవత్సరాల్లోపే యువత మృత్యువాత పడుతున్నా గిరిజనుల్లో మార్పు రావడం లేదు.  

దాడులు జరుపుతున్నా మారని వైనం..
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు తరుచూ దాడులు నిర్వహిస్తున్నా సారా తయారీని పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ఇక ఏజెన్సీ యువతకు ఉపాధి కల్పించి సారా తయారీకి దూరం చేయాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ‘నవోదయం’  వల్ల కూడా ఆశించిన ఫలితాలు రాలేదు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సారా తయారీ, విక్రయాలు, తాగడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం..
సారా తయారీ, విక్రయాలు, తాగడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నాం. తరచూ దాడులు జరుపుతున్నాం. కొంతమంది సారా తయారీని జీవనోపాధిగా చేసుకున్నారు. సారా తయారీ నిర్మూలనకు చర్యలు చేపడతాం.– వి.విజయ్‌కుమార్,ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సీఐ

మరిన్ని వార్తలు