నియామకం.. అక్రమం

22 Jan, 2019 12:35 IST|Sakshi
జీతం చెల్లించాలని ఫైనాన్స్‌ సెక్షన్‌కు రిజిస్ట్రార్‌ జారీ చేసిన ఉత్తర్వులు

వీసీ ఆదేశాలు లేకుండా ఉద్యోగ ఉత్తర్వులు

ఆరు నెలల జీతం ఒకే దఫా చెల్లింపు

అక్రమ మార్గంలో ఆపరేటర్‌ నియామకం

జీతం చెల్లింపునకురిజిస్ట్రార్‌ ఉత్తర్వులు

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల నియామకం అక్రమ మార్గంలో సాగుతోంది. అస్మదీయులకైతే ఎలాంటి విధి విధానాలు లేకుండా, నిబంధనలను కూడా పక్కనపెట్టి అందలం ఎక్కిస్తున్నారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆదేశాలు లేకుండా నేరుగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడనే ధోరణితో బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మిగులు ఉద్యోగులు అధికమైన నేపథ్యంలో ఉద్యోగాలు కల్పించడం విమర్శలకు తావిస్తోంది. ఎస్కేయూ ఇంజినీరింగ్‌ విభాగంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఓ ఉద్యోగిని డైలీ వేజ్‌ కింద గత ఏడాది జూన్‌లో విధుల్లోకి తీసుకున్నారు. అయితే వీసీ అనుమతి లేకుండా నేరుగా ఉద్యోగంలోకి తీసుకోవడం వివాదాస్పదమవుతోంది.

వాస్తవంగా ప్రతి ఉద్యోగి నియామకానికి వీసీ అనుమతి తప్పనిసరి. ఇందుకు విరుద్ధంగా నియామకం చేపట్టారు. ఆ సమయానికి ఇన్‌చార్జి వీసీ ఉన్నా.. లెక్క చేయకపోవడం గమనార్హం. ఇప్పటి నుంచి జీతాలు చెల్లించకుండా ఈ ఏడాది మొదటి వారంలో ఏకంగా ఆరు నెలలకు సంబంధించి జీతం ముట్టజెప్పారు. పని చేసిన మొత్తం రోజులకు కాకుండా.. ప్రతి నెలా కేవలం 15 రోజులే పని చేశారని చూపిస్తూ గత జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు జీతం చెల్లించారు. కనీసం జీతం చెల్లింపు సమయంలోనూ మాటమాత్రమైనా ఇన్‌చార్జి వీసీని సంప్రదించలేదని తెలుస్తోంది. కొత్త వీసీని నియమిస్తారనే సమయంలో జీతం చెల్లించడాన్నిచూస్తే అక్రమార్కులు ఈ నియామకం విషయంలో ఎంత పకడ్బందీగా వ్యవహరించారో అర్థమవుతోంది.

అవుట్‌సోర్సింగ్‌లోనూ అంతులేని అక్రమాలు
2015 ఆగస్టులో తొలిసారిగా అవుట్‌సోర్సింగ్‌ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి ఏజెన్సీకి చెల్లించాల్సిన మొత్తం కంటే అదనంగా చెల్లించి ఉదారత చాటుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అనంతరం వచ్చిన ఏజెన్సీకి ఇదే తరహాలోనే అదనపు మొత్తాన్ని చెల్లించారు. వాస్తవానికి కేవలం 72 ఉద్యోగాలకే అనుమతి వచ్చినప్పటికీ.. ఏకంగా 140 ఉద్యోగాలు కట్టబెట్టారు. గార్డెనింగ్, స్వీపర్‌ కేడర్లతో 100 మందికి పైగా ఉద్యోగం కల్పించారు. వీరంతా ఎక్కడ ఉద్యోగం చేస్తారో.. ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ ప్రతి నెలా జీతాలు మాత్రం చెల్లిస్తున్నారు. ఉద్యోగాలకు గైర్హాజరైనా జీతాలు చెల్లిస్తూ అక్రమాలకు ఊతం ఇస్తున్నారు. అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి రూ.9 లక్షలు అదనంగా చెల్లించి అక్రమాలకు పాల్పడ్డారు.

అనుమతి లేకుండానే నియామకం
వాస్తవానికి అనుమతి లేకుండా నేరుగా ఉద్యోగ నియామకం చేశారు. నేను ఇన్‌చార్జ్‌ వీసీగా ఉన్న సమయంలో ఏ ఒక్కరినీ ఉద్యోగంలోకి తీసుకోలేదు. వీసీ ఆదేశాలు లేకుండానే రిజిస్ట్రార్‌ ఉద్యోగం కల్పించారు. ఈ అంశం గత రెండు రోజుల కిందట నా దృష్టికి వచ్చింది.– ప్రొఫెసర్‌ ఎంసీఎస్‌ శుభ,మాజీ ఇన్‌చార్జ్‌ వీసీ, ఎస్కేయూ

మరిన్ని వార్తలు