ప్లానింగ్‌ లేదు..పన్నూ లేదు!

26 Feb, 2020 10:42 IST|Sakshi
మున్సిపల్‌ ఆఫీసు పక్కనే వెలసిన షెడ్లు

వ్యాపార సముదాయాలతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీ గండి

రహదారులు ఆక్రమించి వేసిన షెడ్ల ద్వారా రూ.లక్షల్లో అద్దె వసూళ్లు

చోద్యం చూస్తున్న అధికారులు

హిందూపురం: ‘మా వార్డులో రోడ్లు వేయండి.. డ్రెయినేజీ మరమ్మతులు చేపట్టండి. తాగునీటి పైపులు వేయించండి’ అంటూ వేడుకుంటున్న ప్రజలకు హిందూపురం మున్సిపాలిటీ అధికారులు నుంచి ఒకేఒక్క సమాధానం ఎదురవుతోంది. అదే మున్సిపాలిటీలో నిధులు లేవు! జిల్లా కేంద్రం తర్వాత అదేస్థాయిలో గుర్తింపు పొందిన హిందూపురం మున్సిపాలిటీకి స్థానిక ఆదాయ వనరులు భారీగా ఉన్నా.. వాటి పరిరక్షణలో అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది. ఫలితంగా ప్రభుత్వం అందించే నిధులపైనే ఆధారపడి మున్సిపాలిటీ అభివృద్ధిని తిరోగమన దిశలో నడిపిస్తూ వచ్చారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు.. మాముళ్ల మత్తులో మరికొందరు అధికారులు హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధిని తుంగలో తొక్కారు. మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఈ విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. 

కంటి ముందే అడ్డగోలు నిర్మాణాలు
పట్టణ పురపాలక కార్యాలయం పక్కనే రోడ్డుకు ఇరువైపులా వరుసగా ప్రైవేట్‌ వ్యక్తులు అక్రమంగా వేసిన షెడ్లు మున్సిపల్‌ అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. ఈ షెడ్లులో ఒక్కొక్కటి రూ. 6 వేలు చొప్పున అద్దెకు ఇచ్చారు. పట్టణ నడిబొడ్డున రద్దీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. రైల్వే రోడ్డు లోని పల్లా రెసిడెన్షీ ప్రాంతం, వీడీ రోడ్డులోనూ వరుసగా పూర్తిగా వాణిజ్య సముదాయాల షెడ్లు వెలిశాయి. ఈ ప్రాంతాల్లో రోజూ రూ. లక్షల్లో వ్యాపారాలు సాగుతుంటాయి. లక్ష్మీ థియేటర్, ఆర్టీసీ బస్టాండ్, పట్టుగూళ్ల మార్కెట్‌ రోడ్డు, రహమత్‌పురం రోడ్డు, బెంగళూరు రోడ్డు, ఆర్పీజీటీ రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణం మొత్తం ఎలాంటి అనుమతులు లేకుం­డా వేసిన షెడ్లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు పోరంబోకు స్థలాలను ఆక్రమించుకుని షెడ్లు వేసిన ప్రైవేట్‌ వ్యక్తులు మున్సిపాలిటీకి ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. ఈ అక్రమాలపై మున్సిపల్‌ అధికారులు దృష్టిసారించలేకపోతున్నారు.  

వాణిజ్య సముదాయాల నిర్మాణాలతో ఆదాయానికి గండి
గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో పురం పరిస్థితులు పూర్తిగా క్షీణించిపోయాయి. పట్టణ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై రాజకీయ నాయకులు పెత్తనం సాగిస్తూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పోరంబోకు స్థలాలను సైతం ఆక్రమించుకుని విచ్ఛలవిడిగా వాణిజ్య సముదాయాల షెడ్లు వేసేశారు. నాలుగు వైపులా ఇనుప పట్టీలు ఏర్పాటు చేసి చుట్టూ రేకులు కప్పేసి గదులు గదులుగా దుకాణాలు సిద్ధం చేశారు. ఒక్కొదానికి నెలకు రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకూ అద్దెతో పాటు అడ్వాన్స్‌ కింద రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకూ వసూలు చేశా­రు. పట్టణం మొ­త్తం ఇలాంటి షెడ్లు కోకొల్లలుగా వెలిసాయి. వీటిలో ఏ ఒక్కదానికి టౌన్‌ ప్లానింగ్‌ అనుమతులు లేకపోవడం గమనార్హం.  

విచారణ అనంతరం చర్యలు చేపడతాం
పట్టణంలో నిర్మించిన షెడ్లకు సంబంధించి కొన్నింటిపై పన్నులు వసూలు చేస్తున్నాం. మా దృష్టికి రాకుండా నిర్మాణమైన వాటిపై విచారణ చేపట్టి మున్సిపాల్టీకి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి నుంచి వసూలు చేస్తాం. పన్నులు చెల్లించని వాటిని తొలగింజేందుకు చర్యలు తీసుకుంటాం.– భవానీ ప్రసాద్,మున్సిపల్‌ కమిషనర్, హిందూపురం

మరిన్ని వార్తలు