కరకట్టపై అక్రమ కట్టడాలు

1 Jul, 2019 09:41 IST|Sakshi
చల్లకాలువ కరకట్టను ఆనుకుని ఉన్న ఇరిగేషన్‌ స్థలంలో నిర్మితమైన మాజీ మంత్రి నారాయణ కళాశాల

కృష్టానది కరకట్ట తరహాలో గూడూరు పట్టణంలో ఇరిగేషన్‌ కాలువల కరకట్టలపై టీడీపీ నేతలు అధికారం అండతో అక్రమంగా భారీ భవంతులు నిర్మించారు. కాలువలను కబ్జా చేసి బహుళ అంతస్తుల కళాశాల, కల్యాణ మండపాల భవనాలు నిర్మించారు. అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న పొంగూరు నారాయణ అక్రమ నిర్మాణాలను అధికారంతో చట్టబద్ధం చేసుకున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా కాలువలు, నదులపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు చర్యలు చేపట్టడంతో పట్టణ ప్రజల దృష్టి గూడూరులో కాలువల కరకట్టలపై నిర్మించిన అక్రమ కట్టడాలపై పడింది.

సాక్షి, గూడూరు: 2012 భవంతుల నిర్మాణ నిబంధనల మేరకు నదుల కరకట్టల నుంచి 500 మీటర్ల వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదు. 10 మీటర్లపైన వెడల్పు ఉన్న కాలువల నుంచి 100 మీటర్ల వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదనే నిబంధనలు ఉన్నాయి. ప్రముఖ విద్యా సంస్థల అధినేత నారాయణ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేయకముందే ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తన కళాశాల భవంతులను నిర్మించారు. ఇరిగేషన్‌ కాలువ కరకట్టను ఆనుకుని ప్రహరీ నిర్మాణంతో పాటు, 100 మీటర్లలోపు ఉన్న ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేశారు. కరకట్ట పక్కనే కళాశాలకు చెందిన ఆట స్థలం, వాహనాల పార్కింగ్‌ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా అటు ఇరిగేషన్, ఇటు మున్సిపల్‌ ఉన్నతాధికారులు గానీ వాటి పైపు కన్నెత్తి చేసి, పట్టించుకున్న దాఖలా లేదు.

ఈ నేపథ్యంలో 2012లో వచ్చిన నిబంధనల ప్రకారం మున్సిపల్‌ అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా ఆ భవంతులు ఏర్పాటు చేశారని కళాశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. అప్పటి మున్సిపల్‌ అధికారులకు ఆయన ద్వారా భారీగా నజరానాలు అందడంతో ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేశారు. 2014 టీడీపీ అధికారంలోకి రావడంతో మున్సిపల్‌శాఖా మంత్రి పదవి దక్కించుకున్న నారాయణ తన అక్రమ భవనాలను అధికారం అండతో సక్రమం చేయించుకున్నారు. మున్సిపల్‌ అధికారులపై  తీవ్ర ఒత్తిళ్లు పెంచి, మానసికంగా వేధింపులకు గురిచేసి వారి ద్వారా చట్టబద్ధం చేసుకున్నారు.  మినీ బైపాస్‌ ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్‌ కాలువను చదును చేసి, ఆ ప్రాంతంలోనే బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించేశారు. 

నారాయణను ఆదర్శంగా తీసుకుని.. 
నారాయణ అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, మున్సిపల్‌ శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో ఆయన అడుగుజాడల్లోనే ఐసీఎస్‌ రోడ్డు ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వనజాకృష్ణ కల్యాణ మండపం పేరుతో తనుకున్న 12 అంకణాల స్థలాన్ని అడ్డుపెట్టుకుని, కోట్ల రూపాయల విలువ చేసే 99 అంకణాల ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టేశారు. ఈ నిర్మాణంతో చెరువుకు సాగునీరు పారే నాయుడుకాలువ ఆక్రమణతో కుంచించుకుపోయింది. ఈ అక్రమ కట్టడంపై పట్టణానికి చెందిన కొందరు లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశారు. వారు అక్రమ నిర్మాణాలను తొలగించాలని కూడా ఆదేశించారు. కానీ తన రాజకీయ పలుకుబడితో జిల్లా రింగ్‌ లీడర్స్‌ అయిన బీద బ్రదర్స్, అప్పటి ఎమ్మెల్యే ద్వారా అధికారులను భయభ్రాంతులకు గురి చేయడంతో వారు అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదు. దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు చెలరేగిపోయారు.

కోట్లాది రూపాయల విలువ చేసే నీటి పారుదల శాఖ కాలువపైనే దుకాణ సముదాయం ఏర్పాటుతో పాటు, మరో వ్యక్తి సొంత స్థలాన్ని అడ్డుపెట్టుకుని, సుమారు 15 అంకణాల కాలువ స్థలాన్ని ఆక్రమించేసి, బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించేశారు. ఆ బహుళ అంతస్తులో ఆంధ్రా బ్యాంకు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు అద్దెలకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నారు. ఈ కాలువ వెడల్పు 25 అడుగులకుపైగా ఉండాల్సి ఉండగా, కాలువ పొడవునా ఆక్రమణలతో కుంచించుకుపోయి, ప్రస్తుతం అది డ్రెయినేజీ కాలువలా మారింది. దీంతో చెరువుకు వర్షపు నీరు పారే పరిస్థితి లేక గత నాలుగేళ్లుగా ఆయకట్టు పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గూడూరుకు వరద ముంపు ముప్పు
గూడూరు పట్టణంలో నుంచి వెళ్తున్న భారీ నీటిపారుదల కాలువలను ఆక్రమించి భారీ భవంతులు నిర్మించడంతో కాలువ కుచించుకుపోయింది. ప్రస్తుతం పైతట్టు ప్రాంతాల్లోని వర్షపు నీరంతా ఈ కాలువల ద్వారా చెరువులకు నీరు చేరాల్సి ఉంది. కాలువలు ఆక్రమణల్లో ఉండడంతో నీరు ముందు సాగే పరిస్థితి లేక గూడూరు పట్టణం ముంపునకు గురయ్యే ముప్పు ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015లో వచ్చిన భారీ వరదల్లో నీటి ప్రవాహం కిందికు వెళ్లలేక, నారాయణ ఆక్రమించి కట్టిన కళాశాల వసతి గృహం ముంపునకు గురైంది. దీంతో అందులో ఉంటున్న వందలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీని కారణంగా అప్పట్లో జాతీయ రహదారిపై వరద నీరు పారడంతో ఒత్తిడి పెరిగి రోడ్డు కొట్టుకుపోయింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుండడంతో గూడూరు పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. భారీ వానలు కురిస్తే భారీగా వరదలు వస్తాయని, లోతట్టు ప్రాంతాలే కాక, మిట్ట ప్రాంతాలు కూడా నీటి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా