అనుమతి ఒకలా.. నిర్మాణాలు మరోలా

12 Sep, 2019 11:57 IST|Sakshi
సాంబమూర్తిరోడ్డులో జరుగుతున్న అక్రమ కట్టడం

వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంలో చోద్యం

జీప్లస్‌టూకు అనుమతి పొంది జీప్లస్‌ 4 వేస్తున్న వైనం

అధికారుల నిర్వాకంతో తగ్గుతున్న కార్పొరేషన్‌ ఆదాయం

అక్రమ నిర్మాణాలను నిరోధించలేకపోతున్న టౌన్‌ప్లానింగ్‌

రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను నిరోధించాలని ఓ వైపు ప్రచారం చేస్తుంటే అవేమీ పట్టనట్లు వీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. నగరంలో లెక్కకు మించి అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పటమట(విజయవాడతూర్పు) : అనుమతి పొందేది ఓ విధమైన భవనానికైతే నిర్మాణం జరిగేది మరో రకమైన నిర్మాణం.. అనుమతులు రాని ప్రాంతాలు, భవనాలకు కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనధికారికంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. నివాసయోగ్యమైన భవనాల అనుమతి పొందుతూ వ్యాపార/వాణిజ్య నిర్మాణాలు చేస్తున్నా.. జీ ప్లస్‌1కి అనుమతి పొంది.. జీ ప్లస్‌ ఐదు ఫ్లోర్లు వేస్తున్నారని ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ఫ్లోర్‌ నిర్మాణాలకు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు లక్షల్లో వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నగర పాలక సంస్థలో ప్రతి సోమవారం జరుగుతున్న స్పందన కార్యక్రమంలో, ప్రతి శుక్రవారం జరుగుతున్న ఓపెన్‌ ఫోరంలో అనధికారిక నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఆయా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

హనుమాన్‌పేటలో ఏలూరులాకులకు వెళ్లే మార్గంలో అనధికారిక ఫ్లోర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టిల్టు, గ్రౌండ్‌ ఫ్లస్‌ రెండు ఫ్లోర్లకు మాత్రమే అనుమతి ఉన్న భవనంపై గతంలో అనధికారికంగా నిర్మాణం జరుగుతుంటే సంబంధిత అధికారులు వెళ్లి భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయటమే కాకుండా అక్రమకట్టడాన్ని కూల్చివేశారు. నిబంధనల మేరకు ప్లాను పొందిన తర్వాత మాత్రమే భవనం పునఃనిర్మాణం చేపట్టాల్సి ఉండగా వీఎంసీలోని ఓ కీలక అధికారి చక్రం తిప్పి అదనపు అంతస్తులు వేయటానికి లక్షల్లో బేరం కుదుర్చుకున్నారు. రెసిడెన్షియల్‌ విభాగంలో పాత ప్లాను పొందిన భవనం కమర్షియల్‌ వినియోగాలకు అనువుగా నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనివల్ల కార్పొరేషన్‌కు సమకూరాల్సిన ఆదాయం కూడా అధికారులు తమ జేబులో వేసుకుంటున్నారని ఆరోపణలు. మరో నిర్మాణంలో పూర్తిగా నిబంధనలనేవి కేవలం పత్రాలకే పరిమితం అన్నట్లు వ్యవహరించారని విమర్శ. గాంధీనగర్‌లోని సాంబమూర్తి రోడ్డులోని డీమార్టు వద్ద అతి కొద్ది స్థలంలో భారీ భవనానికి అనధికారికంగా అనుమతులు ఇచ్చేశారు. రెసిడెన్షియల్‌ విభాగంలో జీ ఫ్లస్‌–1 మాత్రమే అనుమతి ఉన్న ఈ భవనానికి అధికారుల చలవతో జీ ఫ్లస్‌–4 స్లాబులు వేయటంతోపాటు పార్కింగ్‌కు కేటాయించాల్సిన ప్రాంతాన్ని వ్యాపార వినియోగాలకు అనువుగా దుకాణ సముదాయాలను నిర్మిస్తున్నారని కార్పొరేషన్‌ 103కి పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

తగ్గుతున్న ఆదాయం
నిబంధనల మేరకు కార్పొరేషన్‌కు భవన నిర్మాణ అనుమతులకు చలానా రూపంలో స్థలం, నిర్మాణం జరిగే ప్రాంతానికి, యూజీడీ కనెక్షన్లకు, తాగునీటికి, నిర్మాణ వ్యర్థాల తొలగింపు వంటి తదితర అంశాల్లో చలానా రూపంలో నగదు చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది. అనధికారిక నిర్మాణాల వల్ల ఇటు కార్పొరేషన్‌కు సమకూరాల్సిన ఆదాయం అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

చర్యలు తీసుకుంటాం
సంబంధిత భవనాల గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయా ఫిర్యాదుల మేరకు విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నాం. అనధికారిక నిర్మాణాలను కూల్చేస్తాం.–లక్ష్మణరావు,వీఎంసీ ప్రణాళిక అధికా>రి

మరిన్ని వార్తలు