ఆశపెట్టి.. అగాధంలోకి..

23 Jun, 2014 17:11 IST|Sakshi
ఇరాక్ లోని కార్వంచ్ కంపెనీలో కార్మికులు

మోర్తాడ్ (నిజామాబాద్):  భారీ వేతనం.. మంచి వసతి అంటూ ఆశపెట్టి విదేశాలకు పంపుతున్న ఏజెంట్లు వారి బతుకులను అగాథంలోకి నెడుతున్నారు. ఇరాక్‌లోని వివిధ కంపెనీల్లో పని కోసం పంపిన ఏజెంట్ల మోసపూరిత విధానాలు మన కార్మికుల పాలిట శాపంగా మారాయి. ఇరాక్ అంతర్యుద్ధం నేపథ్యంలో ఏజెంట్ల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిరుద్యోగులను మాయ చేసిన ఏజెంట్లు వర్క్ వీసాల పేర రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.75వరకు వసూలు చేసి విజిట్ వీసాలను చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు.

ప్రస్తుతం వర్క్ వీసా ఉన్నవారిని మాత్రమే స్వస్థలాలకు వెళ్లడానికి ఇరాక్ ప్రభుత్వం అనుమతినిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారికి అనుమతి ఇవ్వకపోవడంతో వేలాది మంది కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. కిర్కుక్ ప్రాంతంలోని కార్వంచ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ గ్రూపు కంపెనీలో ఉన్న 250 మంది కార్మికులకు వర్క్ వీసాలు లేవు. ఈ ఒక్క కంపెనీలోనే కాక ఇరాక్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్న అనేక కంపెనీల్లో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి అలాగే ఉంది.
 
ఏళ్ల తరబడి ఇలాగే...
దుబాయ్, ఖతర్, మస్కట్, బెహరాన్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లడం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి ఏళ్లుగా సాగుతోంది. గల్ఫ్‌లో పని చేస్తున్న వారి సంఖ్య పెరగడంతో పోటీ ఎక్కువై వేతనాలు తగ్గాయి. అయితే, ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల్లో పునర్‌నిర్మాణం పనుల కోసం అమెరికా కంపెనీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పని చేయడానికి కార్మికులు అధికంగా అవసరం అయ్యారు. అంతేకాక మిలట్రీ క్యాంపుల్లోను పని చేయడానికి కార్మికులు కావాల్సి వచ్చింది. దీంతో కార్మికులకు అక్కడి కంపెనీలు వేతనాలను ఎరగా వేసింది.

ఇరాక్‌లో పని చేస్తే నెలకు 400 నుంచి 500 అమెరికన డాలర్లు వేతనంగా లభిస్తాయని, భోజనం.. వసతి సౌకర్యం ఉంటుందని ఏజెంట్లు ఆశ పెట్టారు. ఈ పరిస్థితుల్లో వర్క్ వీసాలు లేకున్నా.. వేతనాలు వస్తాయనే ఉద్దేశంతో ఎంతో మంది భారతీయులు ఇరాక్, ఆప్ఘనిస్థాన్‌కు వెళ్లారు. ఇందులో తెలుగువాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే, ఏజెంట్లు తమకు మూడు నెలల విజిట్ వీసాలను ఇచ్చారని,  ఇరాక్ వెళ్లిన తరువాత వర్క్ పర్మిట్ ఇస్తారని చెప్పారని కార్మికులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే, వర్క్ పర్మిట్ మాత్రం ఇవ్వలేదని, వేతనం వస్తుంది కదా అని వీసాల విషయం ఎవరిని అడగలేదని పేర్కొంటున్నారు.
 
ఏజెంట్ల హుండీ దందా..
వర్క్ వీసాలు లేని వారు కంపెనీ క్యాంపులను విడిచి బయట తిరిగే పరిస్థితి లేదు. దీంతో కార్మికులు ప్రతి నెల వారి వేతనాలను ఇంటికి పంపడానికి అధికారికంగా ఉన్న మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రాలను వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో హుండీ దందాకు అవకాశం ఏర్పడింది.  నిరుద్యోగులను పంపించిన ఏజెంట్లే హుండీ దందా చేస్తున్నారు తమ ప్రతినిధులను నియమించుకుని కార్మికులు ప్రతి నెలా పంపే సొమ్మును హవాలా ద్వారా కార్మికుల ఇళ్లలో చెల్లిస్తున్నారు.  
 
దొరకని లెక్కలు..
భారత్ నుంచి ఇరాక్‌కు నేరుగా వెళ్లే అవకాశం లేకపోవడం.. ఏజెంట్లు వయా దుబాయిగా ఇరాక్‌కు పంపుతుండడంతో ఇక్కడి నుంచి ఇరాక్‌కు వెళ్లిన వారెందరు అనే లెక్క తేలడం కష్టంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఇరాక్ వెళ్లినప్పటికీ వారిలో చాలా మంది దుబాయ్ నుంచి వెళ్లడంతో వారికి సంబంధించిన వివరాలు తెలియరావడం లేదు. దీంతో ఇరాక్‌లో ఉన్న వారి లెక్క కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.
 

మరిన్ని వార్తలు