దాచేస్తే దాగేదా..!

19 Nov, 2017 10:11 IST|Sakshi

రూటు మార్చిన గో మాఫియా

 ప్రజాప్రతినిధి అనుచరుల రంగప్రవేశం

 దారిమళ్లిన పాడి గేదెలు ఎక్కడ! 

గో మాఫియా రూటు మార్చింది. పోలీసులు పట్టుకుని గోశాలకు అప్పగించిన పశువులు మళ్లీ దారి మళ్లాయి. ఒక ప్రజాప్రతినిధి వద్ద పీఏగా వ్యవహరిస్తున్న వ్యక్తితోపాటు ఓ ఎంపీటీసీ సభ్యుడు రంగప్రవేశం చేసి వాటిని సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ ఘటనతో ఇప్పటివరకూ బ్రోకర్లతో మాట్లాడి పశువులను దారి మళ్లించి కబేళాలకు చేరేలా చూసే గో మాఫియా రూటు మార్చినట్టు, గోప్యంగా తమ పని కానిస్తున్నట్టు స్పష్టమవుతోంది.  

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏజెన్సీలోని బుట్టాయగూడెం స్టేషన్‌ పరిధిలో ఈ నెల 11న  అక్రమంగా రెండు డీసీఎం వ్యాన్‌లలో తెలంగాణకు రవాణా అవుతున్న 39 గేదెలను  పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గేదెలను నల్లజర్ల సమీపంలోని ఆవపాడు గోశాలకు తరలించారు. అక్కడి నుంచి కథ మలుపు తిరిగింది. 

స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలం ! : స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో వారి
అనుచరగణం రంగ ప్రవేశం చేసినట్టు సమాచారం. ఆయన పీఏగా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి, బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడు రంగంలోకి దిగి గోశాల నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి.. బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడేనికి చెందిన రైతుల పేరుతో ఆధార్‌ కార్డులు సమర్పించి వాటిని పెంచుకుంటామంటూ చెప్పి  దారి మళ్లించినట్టు తెలుస్తోంది. 39 గేదెలు, దూడలను అప్పగించగా.. అందులో కేవలం ఆరు మాత్రమే గోశాలలో ప్రస్తుతం ఉన్నాయి. మిగిలిన వాటిని ప్రజాప్రతినిధి అనుచరులు తీసుకువెళ్లిపోయినట్టు సమాచారం.   ఈ గేదెలన్నీ పాలిచ్చేవి కావడంతో వీటిపై దృష్టి పెట్టినట్టు సమాచారం.  

 ఒట్టిపోయినట్టు చూపించి..!
తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ పశువుల డాక్టర్లను గో మాఫియా మభ్యపెట్టి అవి ఒట్టిపోయిన గేదెలుగా నిర్ధారింపజేసి అందుకు అవసరమైన పత్రాలను సృష్టించి రవాణా చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఘటనలో పోలీసులు గోశాలకు తరలించిన  గేదెలు ఎక్కడ ఉన్నాయన్నది తెలియరాలేదు.  పాడిగేదెలు కావడంతో అమ్మేసుకు న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయాన్ని గోప్యంగా సర్దుబాటు చేసేందుకు మరో ఎమ్మెల్యేతో కలిసి యత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

రూటు మార్చిన పశు మాఫియా
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లకు అక్రమంగా పశువులను తరలిస్తున్న వైనంపై ఇటీవల ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో పశు మాఫియాకు అండదండలు అందించిన ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సర్దుకునే యత్నంలో కొద్ది కాలం తాత్కాలికంగా రవాణాను నిలిపివేశారు. మళ్లీ రెండు  నెలలుగా పశు మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ మార్గాల ద్వారా పశువులను కబేళాకు తరలిస్తోంది. గతంలో ఉత్తరాంధ్ర నుంచి రోడ్డు మార్గాన కొవ్వూరుకు వచ్చిన అక్రమ పశువుల రవాణా వాహనాలు దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా తెలంగాణలోకి ప్రవేశించేవి.  ‘సాక్షి’ కథనాల తర్వాత మాఫియా రూటు మార్చింది. కొవ్వూరుకు చేరిన పశువుల వాహనాలను తాళ్లపూడి, దొండపూడి, కన్నాపురం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మీదుగా తెలంగాణకు తరలిస్తోంది. ఈ దారిలో తరలిస్తుండగానే పోలీసులు ఈ రెండు డీసీఎం వ్యాన్లను పట్టుకున్నారు.

నోరుమెదపని పోలీసులు 
ఈ వ్యవహారంపై పోలీసులు నోరుమెదపడం లేదు. అక్రమంగా తరలిపోతున్న పశువులను పట్టుకుని గోశాలకు అప్పగించడం వరకే తమ బాధ్యత అని చెబుతున్నారు. అయితే గోశాలలపై పూర్తి దృష్టి పెట్టకపోతే అక్రమ పశురవాణాను అడ్డుకున్నా.. ఫలితం ఉండదని గుర్తించాలి. 

మరిన్ని వార్తలు