క్వారీ.. కొర్రీ

10 Nov, 2019 15:56 IST|Sakshi
మడకశిరలోని ఓ క్వారీలో తరలించడానికి సిద్ధంగా ఉన్న గ్రానైట్‌

ఉల్లం‘ఘనులు’ 

రూ.కోట్లలో జరిమానాలు 

పైసా చెల్లించని క్వారీల  యజమానులు 

యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలు 

పట్టించుకోని గనుల శాఖ అధికారులు  

అనంతపురం టౌన్‌: క్వారీ నిర్వాహకులు...ప్రభుత్వ ఖజానాకు కొర్రీ పెడుతున్నారు. ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే సహజ వనరులను సరిహద్దు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా మైనింగ్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం విజిలెన్సు అధికారులు జిల్లాలో వ్యాప్తంగా క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 60 క్వారీలకు రూ.100కోట్లకుపైగా జరిమానాలు విధించారు. అయినా నేటికీ పైసా వసూలు కాలేదు. దీనిపై దృష్టి సారించాల్సిన గనులశాఖ అధికారులు ఏమాత్రం పట్టిచుకోకపోవడం లేదు. దీంతో క్వారీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు.

వసూళ్లు శూన్యం.. 
2018 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 40 క్వారీలపై విజిలెన్సు అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వానికి చెల్లించిన రాయలీ్టకి.. క్వారీల్లో చేపట్టిన తవ్వకాలకు పొంతన లేకపోవడంతో దాదాపు 30 క్వారీలకు రూ.46.84 కోట్లు జరిమానా విధించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 37 కేసులు నమోదు చేసి రూ.32.19 కోట్ల మేర జరిమానా విధించారు. గనులశాఖ అధికారులు నేటికీ పైసా వసూలు చేయలేదు. 

యథేచ్ఛగా తవ్వకాలు.. 
క్వారీ నిర్వాహకులు జరిమానాలు చెల్లించకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. జరిమానా కట్టని క్వారీలను సీజ్‌ చేయాలని గనులశాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో గనులశాఖ విజిలెన్స్‌ అధికారులు నెలరోజులుగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మడకశిర, పెనుకొండ, గోరంట్ల మండలాల క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్‌ వాహనాలను సీజ్‌ చేశారు. ఇక శెట్టూరు మండలంలోని గ్రానైట్‌ క్వారీలకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక సరిహద్దు ఉండగా... అక్కడి క్వారీల నిర్వాహకులు తక్కువ క్యూబిక్‌ మీటర్లకు రాయల్టీ చెల్లించి అధిక మొత్తంలో అత్యంత విలువైన బ్లాక్‌ గ్రానైట్‌ను తరలిస్తున్నారు. దీంతోపాటు పెనుకొండ నియోజకవర్గంలో రోడ్డు మెటల్‌ క్వారీలకు దాదాపు రూ.10 కోట్లకుపైగా జరిమానా విధించారు. అయితే అక్కడ సైతం తవ్వకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీ నిర్వాహకులు జరిమానా విధించిన క్వారీల్లోనే తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.  

నోటీసులు జారీ చేశాం 
జరిమానా విధించిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఇప్పటికే క్వారీ నిర్వాహకులకు నోటీసులను జారీ చేశాం. నిర్ణీత గడువులోగా జరిమాన సొమ్ము చెల్లించకపోతే క్వారీలు సీజ్‌ చేస్తాం. జరిమానా విధించిన క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు చేపడితే క్రిమినల్‌ కేసులకు సిఫార్సు చేస్తాం.  
– ఓబుల్‌రెడ్డి, గనులశాఖ ఏడీ  

మరిన్ని వార్తలు