ఇసుకాసురులకు ముఖ్య నేత అండ!

26 Apr, 2019 03:56 IST|Sakshi

ఎన్జీటీ తీర్పు మేరకు స్మగ్లర్ల నుంచి జరిమానా వసూలుకు మోకాలడ్డు

జరిమానా వసూలు చేస్తే ముడుపుల గుట్టు రట్టవుతుందని ఆందోళన

ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌  చేయాలంటూ గనుల శాఖపై ఒత్తిడి

కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగలేదంటూ అవాస్తవాలు వల్లెవేత

ప్రకాశం బ్యారేజీలో పూడిక తీసిన ఇసుకనే తరలించారంటూ అభూతకల్పనలు

అక్రమార్కులకు సర్కారు దన్నుగా నిలవడంపై సర్వత్రా విమర్శలు

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో విధ్వంసం సృష్టించి.. అడ్డగోలుగా, అక్రమంగా ఇసుకను తవ్వేసి వేలాది కోట్ల రూపాయాలు దోచుకున్న ఇసుక స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. పర్యావరణానికి విఘాతం కలిగించిన ఇసుక స్మగ్లర్ల నుంచి నెలలోగా రూ.వంద కోట్లను జరిమానాగా వసూలు చేసి.. డిపాజిట్‌ చేయాలని జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ) ఈనెల 4న ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి సిద్ధమైన గనుల శాఖ అధికారులపై ముఖ్య నేత కన్నెర్ర చేశారు. ప్రకాశం బ్యారేజీలో పూడిక తీత పేరుతో డ్రెడ్జింగ్‌ చేయకుండా, భారీ ప్రొక్లెయిన్‌లను రంగంలోకి దించి.. కృష్ణా నదీ గర్భాన్ని దాదాపు 37 రీచ్‌లలో అడ్డగోలుగా తవ్వేసిన వ్యవహారంలో  ముఖ్య నేత పాత్రపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో ఎనిమిది రీచ్‌లలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వించారు. కోట్లాది క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించి.. వేలాది కోట్ల రూపాయాలను దోచేయడంలో ముఖ్య నేతకు వాటాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి.

పర్యావరణానికి తీవ్ర విఘాతం
కృష్ణా నదిలో ఇసుకను అక్రమంగా తరలించడంపై రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌ మ్యాన్, తరుణ్‌ భారత్‌ సంఘ్‌ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజేంద్రసింగ్, ప్రొఫెసర్‌ విక్రమ్‌ సోనీ, రాజధాని ప్రాంత రైతు కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ తరఫున అనుమోలు గాంధీ, బొలిశెట్టి సత్యనారాయణ గత ఏడాది అక్టోబర్‌లో రాసిన లేఖనే పిటిషన్‌గా పరిగించిన ఎన్జీటీ కేసును విచారించింది. సీఎం అధికారిక నివాసానికి కూత వేటు దూరంలో భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను వ్యతిరేకించినందుకు అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు తమపై దాడులకు పాల్పడ్డారని ఎన్జీటీకి వివరించారు. ఈ వ్యవహారంపై డీజీపీకి, స్థానిక పోలీసులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇసుక దొంగలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ స్వరూపం దెబ్బతిందని, గట్లు బలహీన పడ్డాయని, పర్యావరణానికి విఘాతం కలిగిందని వివరించారు. ఈ వ్యవహారంపై నిశితంగా అధ్యయనం చేసి.. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)ని గత ఏడాది డిసెంబర్‌ 21న ఎన్జీటీ ఆదేశించింది.

దోపిడీకి అద్దం పట్టిన నివేదిక
ఎన్జీటీ ఆదేశాల మేరకు సీపీసీబీ, ఏపీపీసీబీ అధికారుల బృందం జనవరి 17, 18 తేదీల్లో సీఎం అధికారిక నివాసానికి సమీపంలోని కృష్ణా నదిలో పెనుమాక, వెంకటపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, సూరాయపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం(ఫెర్రీ) ఇసుక రీచ్‌ల్లో తనిఖీలు చేసింది. ఆయా రీచ్‌లలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు తేల్చింది. ఎనిమిది రీచ్‌లలో రోజుకు 2,500 ట్రక్కుల ద్వారా దాదాపు 34,650 టన్నుల ఇసుకను తవ్వేసి.. రవాణా చేస్తున్నట్లు తేల్చింది. నదీ గర్భంలో 25 అడుగుల లోతు వరకూ ఇసుక తవ్వకాలు చేస్తున్నారని.. మర పడవల ద్వారా ఇసుకను ఒడ్డుకు తరలిస్తున్నారని వెల్లడించింది. ఇసుక తవ్వకాలు ఏడాది పొడవునా జరుగుతున్నాయని తెలిపింది. మర పడవల్లోని డీజిల్‌ ఇంజిన్ల కారణంగా చమురు నదిలోకి వెళ్లి కాలుష్యం ఏర్పడుతోందని, భారీ ట్రక్కుల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని నివేదించింది. తాము తనిఖీ చేసిన 8 ఇసుక రీచ్‌లలో ఐదింటిలో మాత్రమే బ్లూఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ అనే సంస్థ రూపొందించిన యాప్‌ ద్వారా ట్రక్కుల వివరాలు నమోదు చేస్తున్నారని, మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి నమోదూ చేయడం లేదని తేల్చింది. లింగాయపాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా చేపట్టిన అక్రమ తవ్వకాలపై ఎలాంటి డేటా అందుబాటులో లేదని వివరించింది. ఇబ్రహీంపట్నంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని, వందలాది మర బోట్లు, వాహనాల ద్వారా ఇసుక రవాణా జరుగుతోందని నివేదించింది. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3.071 టీఎంసీలు మాత్రమేనని.. భారీగా ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే భవానీ ద్వీపం వంటి ద్వీపాలు దెబ్బతిన్నాయని, నది గట్లు బలహీననడ్డాయని, భూగర్భ జలాలు క్షారయుతంగా మారాయని, నది స్వరూపం పూర్తిగా దెబ్బతినిందని, ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఎన్జీటీకి నివేదించాయి. ఈ నివేదికతో పూర్తిగా ఏకీభవించిన ఎన్జీటీ.. ఇసుక స్మగ్లర్ల నుంచి రూ.వంద కోట్లను జరిమానాగా వసూలు చేసి, నెల రోజుల్లోగా తమ వద్ద డిపాజిట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అవాస్తవాలతో అక్రమాలను కప్పిపెట్టే ఎత్తు
ఎన్జీటీ ఇచ్చిన తీర్పు టీడీపీ సర్కార్‌కు చెంపపెట్టుగా మారింది. ఇసుక స్మగ్లర్లకు జరిమానా విధిస్తూ.. నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన గనుల శాఖ ఉన్నతాధికారులపై ముఖ్య నేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్జీటీ తీర్పును అమలు చేస్తే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అదే జరిగితే తన వాటాల బాగోతం బట్టబయలు అవుతుందని భావించి ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో బుధవారంఫిటిషన్‌ దాఖలు చేసేలా చక్రం తిప్పారు. ప్రకాశం బ్యారేజీలో పూడిక తీసిన ఇసుకను తరలిస్తున్నారే తప్ప ఎక్కడా అక్రమంగా ఇసుకను తవ్వలేదని, తమ వాదనను వినకుండా  ఎన్జీటీ ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేలా గనుల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి పిటిషన్‌ వేశారు. వాస్తవంగా ప్రకాశం బ్యారేజీలో పూడికతీత పరిమాణం చాలా తక్కువ. అయితే ఆ పూడిక తీత ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా నదీ గర్భాన్ని చిద్రం చేసి వేలాది కోట్ల రూపాయాలు కొల్లగొట్టారు. అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి సర్కారు అవలంభిస్తున్న వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు