ఉల్లం‘గనులు’

21 Sep, 2019 09:25 IST|Sakshi
కొండను లోతుగా తవ్వేయడంతో చెరువును తలపిస్తున్న దృశ్యం

నిబంధనలు బేఖాతర్‌..

అనుమతి లేకుండానే భారీ పేలుళ్లు

విచ్చలవిడిగా జిలెటిన్‌ స్టిక్స్‌ వినియోగం

అక్రమ క్వారీ నిర్వాహకుల ఇష్టారాజ్యం

ప్రభుత్వ ఆదాయానికి గండి

కన్నెత్తి చూడని గనుల శాఖ 

నిబంధనలు అతిక్రమిస్తున్నా అదుపు లేదు.. ప్రాణాలు పోతున్నా లెక్క లేదు.. ప్రభుత్వాదాయానికి గండి పడుతున్నా ఖాతరు లేదు.. యథేచ్ఛగా గనులను దొలిచేస్తున్నారు.. కాసులు కొల్లగొడుతున్నారు.. క్వారీల నిర్వహణలో నియమ నిబంధనలు మచ్చుకైనా అమలు కావడం లేదు. బ్లాస్టింగ్‌లకు అత్యంత ప్రమాదకరమైన జిలెటిన్‌ స్టిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. కొండలను పిండి చేస్తున్నారు. దీంతో క్వారీలను నిర్వహిస్తున్న మేస్త్రీలు కాసులు సంపాదిస్తున్నారు. నిబంధనలు పాటించకపోవడం, రక్షణ కిట్లు ఇవ్వకపోవడంతో పొట్ట కూటి కోసం రాయి పనిచేస్తున్న క్వారీ కార్మికులు గాయాలు పాలై అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వీటిపై నిఘా వేయాల్సిన అధికార యంత్రాంగం కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

సాక్షి, పొందూరు: ప్రభుత్వానికి చేరాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం అక్రమ క్వారీ నిర్వాహకుల జేబుల్లోకి వెళుతున్నాయి. క్వారీ చేసుకునేందుకు మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి విస్తీర్ణం చాలా తక్కువ మేరకు ఉంటుంది. దానికి మూడు, నాలుగు రెట్ల మేరకు కొండను పేల్చేస్తున్నారు. కొండ ఎత్తు మూడు నుంచి నాలుగు వందల మీటర్లు ఉంటే దాని కింద సుమారు రెండు నుంచి మూడు వందల మీటర్లు లోతు వరకు దొలిచేస్తున్నారు. ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను రాళ్లుగా మార్చి కోట్లు కూడబెట్టుకొంటున్నారు. మైనింగ్‌ అధికారులు క్వారీ పనికి ఇచ్చిన అనుమతుల మేరకు కిందకు కొంత పరిమితి వరకు మాత్రమే వెళ్లి రాయిని తీయాల్సి ఉంటుంది. అయితే అపరిమితంగా రాయిని దొలిచేస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు కుటుం బాలు వీధిన పడుతున్నాయి. మండలంలో రాపాక, ఇల్లయ్యగారిపేట, గారపేట, రెడ్డిపేట సమీపాల్లో క్వారీ లు నిర్వహిస్తున్నారు. సుమారు 100 మంది మేస్త్రీలు ఇక్కడ క్వారీలను నడిపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన లీజుదారులు 16 మంది ఉండగా అక్రమ లీజుదారులు కనీసం 100 మంది వరకు ఉన్నారు

యథేచ్ఛగా జిలెటిన్‌ స్టిక్స్‌ వాడకం..
కొండను బ్లాస్టింగ్‌ చేసేందుకు లైసెన్సు ఉండాలి. కాని మండలంలో ఎవరికీ లైసెన్సులు లేవు. తక్కువ పరిమాణంలో మందును ఉపయోగించి బ్లాస్టింగ్‌ చేసేందుకు ఒకరిద్దరికి మాత్రమే అనుమతి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ పరిమాణంలో పేలుడు పదార్ధాలు, భారీ విస్ఫోటనం కలిగించే జిలెటిన్‌ స్టిక్స్, భారీ స్థాయిలో అమ్మోనియం నైట్రేటు ఉపయోగిస్తున్నారు. కూరగాయలు అమ్మడానికి వీధుల్లో తిరుగుతున్న మాదిరిగా ఇంటింటికీ పేలుడు పదార్ధాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఈ పేలుడు పదార్ధాలను విక్రయించి ఖాళీగా ఉన్న ఇళ్లల్లోను, పలువురు వారి సొంత ఇళ్లల్లోను నిల్వ చేస్తున్నారు. వాస్తవానికి క్వారీలలో పేలుళ్లు నిర్వహించాలంటే పోలీసు, ఎక్స్‌ప్లోజివ్‌ డిపార్ట్‌మెంట్‌ (న్యూఢిల్లీ) నుంచి అనుమతులు తీసుకోవాలి. వారి గైడ్‌లైన్స్‌ మేరకు మాత్రమే సాధారణ పేలుడు పదార్ధాలు ఉపయోగించాలి. అది కూడా నిపుణుడైన, సుశిక్షితుడైన వ్యక్తి మాత్రమే బ్లాస్టింగ్‌ నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల ప్రమాదాల బారిన పడకుండా కార్మికులకు రక్షణ కలుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. అయితే ఇక్కడ బ్లాస్టింగ్‌లు అక్షర జ్ఞానం లేని కూలీలను, జిలెటిన్‌ స్టిక్, డిటొనేటర్‌ అంటే తెలియని అమాయకులతో õనిర్వహిస్తున్నారు.

బాంబుల హోరు.. జనం బేజారు..
జిలెటిన్‌ స్టిక్స్, అమ్మోనియం నైట్రేట్‌ పేలుడు పదార్ధాలతో మండలంలోని కొండలను పేల్చుతున్నారు. పొందూరుకు చుట్టుపక్కల ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్‌  క్వారీలు ఉన్నాయి. గత రెండు రోజులుగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాంబుల మోతతో పొందూరు చుట్టుపక్కల గ్రామాలు హోరెత్తిపోతున్నాయి. శుక్రవారం పలువురి క్వారీల్లో కంప్రెషర్‌ ఉపయోగించి రాళ్లకు రంధ్రాలు చేసి జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టి పేలుడుకు సిద్ధం చేస్తుండగా సాక్షి క్లిక్‌మనిపించింది. 

మృత్యుబారిన పలువురు కార్మికులు..
కొండలకు బెజ్జాలు పెడుతున్నప్పుడు, కొం డపైకి ఎక్కుతున్నప్పుడు, ట్రాక్టర్‌లోకి రాళ్ల ను ఎత్తుతున్నప్పుడు, బ్లాస్టింగ్‌లు జరుపుతున్నప్పుడు కార్మికులు మృత్యుబారిన పడుతున్నారు. కాళ్లు, చేతులు, వేళ్లు తెగిపడిన వారు ఉన్నారు. 2019 జనవరి 2న ఇల్లయ్యగారిపేట జరిగిన బ్లాస్టింగ్‌లో కెంగువ రామారావు మృతి చెందగా.. 2018 జూన్‌ 26న క్వారీలో నుంచి ట్రాక్టర్‌ను రోడ్డుపైకి తీసుకొస్తుండగా ట్రాక్టర్‌ బోల్తాపడి మహదాస్యం నాగరాజు, 2015 జూన్‌ 13న కొండపై నుంచి జారిపడి కొంచాడ శ్రీను మృతి చెందారు. ఇలా ఎందరో మృత్యు ఒడిని చేరారు. ఇంత జరుగుతున్నప్పటికీ మృతుల కుటుంబాలకు సరైన న్యాయం జరగటం లేదు. వారికి నామమాత్ర పరిహారం అందిస్తూ పోలీసులకు, మైనింగ్‌ అధికారులకు లక్షల్లో ముట్టచెబుతున్నారు. బ్లాస్టింగ్‌లు జరపొద్దని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అక్రమార్కులు పట్టించుకోవటం లేదు. పై స్థాయిలో అధికారులు కచ్చితంగా బ్లాస్టింగ్‌లు జరపవద్దని చెబుతున్నారు. కింది స్థాయిలో అమలుకు లొసుగులు అడ్డువస్తున్నాయేమో గాని బ్లాస్టింగ్‌లు మాత్రం ఆపడం లేదు.

క్వారీలను పరిశీలించిన సీఐ..
మండలంలోని క్వారీలను జేఆర్‌ పురం సీఐ హెచ్‌ మల్లేశ్వరరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. రాపాక, ఇల్లయ్యగారిపేట క్వారీలను పొందూరు పోలీసు సిబ్బందితో కలిసి సందర్శించారు. బ్లాస్టింగ్‌లు ఎక్కడైనా జరుగుతున్నాయా? అని తెలుసుకునేందుకు పర్యటించామని చెప్పారు. అక్రమంగా పేలు ళ్లు జరిపితే చర్యలు తీసుకుంటామన్నారు. 

అతిక్రమిస్తే లీజు రద్దు..
క్వారీల నిర్వహణ కచ్చితంగా లీజుదారులే చేయాలి. అది కూడా వారికి మైనింగ్‌ అధికారులు కేటాయించిన కొండలో నిబంధనలను అధిగమించకుండా క్వారీ నిర్వహించాలి. అనుమతి ఇచ్చిన కొండ విస్తీర్ణం దాటి క్వారీ నిర్వహిస్తే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారి లీజు రద్దుకు సిఫార్సు చేస్తాం.     – టి.రామకృష్ణ, తహశీల్దార్, పొందూరు

అక్రమార్కులపై కఠిన చర్యలు..
క్వారీల్లో జిలెటిన్‌ స్టిక్స్, పేలుడు పదార్ధాలు ఉపయోగిస్తే వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసులది. మైనింగ్‌కు ఇచ్చిన విస్తీర్ణం కంటే ఎక్కువ క్వారీ నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లీజు రద్దు చేస్తాం.  
–సత్యనారాయణ, గనులు, భూగర్భ శాఖ ఏడీ

అక్రమ పేలుళ్లకు క్వారీ లీజుదారులే బాధ్యులు
క్వారీ నిర్వహణకు బ్లాస్టింగ్‌లు జరపొద్దని హెచ్చరించాం. ప్రమాదకర పేలుడు పదార్ధాలు ఉపయోగిస్తే విడిచిపెట్టం. ఎక్కడైనా అక్రమంగా బ్లాస్టింగ్‌లు జరిగితే క్వారీ లీజుదారులే బాధ్యులవుతారు. అరెస్టులు కూడా చేస్తాం.
–హెచ్‌.మల్లేశ్వరరావు, సీఐ, జేఆర్‌ పురం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా