మైనింగ్‌ మాఫియాపై విజి‘లెన్స్‌’

10 Jul, 2020 07:03 IST|Sakshi
అక్రమ మైనింగ్‌ను పరిశీలిస్తున్న మైనింగ్‌ శాఖ విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి

అనకాపల్లిలో గత ప్రభుత్వ హయాంలో అక్రమ తవ్వకాలు 

స్థానికుల ఫిర్యాదులతో గనుల శాఖ దాడులు 

రూ.33.02 కోట్ల అపరాధ రుసుం విధింపు  

దొండపర్తి(విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులు భూములు పంచుకుంటే.. వారి అనుచరులు, సానుభూతిపరులు కొండలు మింగేశారు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రతి ఒక్కరూ రెచ్చిపోయారు. ల్యాండ్, మైనింగ్‌ మాఫియాగా చెలరేగిపోయారు. వారి అక్రమాలకు కొండలు సైతం కరిగిపోయాయి. అనుమతులు ఒక చోట తీసుకొని మరోచోట మైనింగ్‌ చేస్తూ సాగించిన అక్రమాలు జిల్లాలో ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గోరంత అనుమతులు తీసుకుని కొండలకు కొండలు తవ్వేస్తున్న వ్యవహారాలు గనుల శాఖ విజిలెన్స్‌ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు ఆయా సంస్థలకు భారీ స్థాయిలో రూ.33,02,61,364 అపరాధ రుసుం విధించారు. జిల్లాలో అనకాపల్లి మండలం సీతానగరంలో సర్వే నంబర్‌ 251లో రెండు చోట్ల 7.05 హెక్టార్లు, 7.50 హెక్టార్లలో ఉన్న కొండలను పి.వెంకటేశ్వరరావు పేరు మీద మైనింగ్‌ కోసం లీజుకు ఇచ్చారు. అనుమతులకు మించి తవ్వకాలు జరపడంతో స్థానికుల ఫిర్యాదుల మేరకు మైనింగ్‌ అధికారులు దాడులు చేశారు. 

అనుమతులకు మించి తవ్వకాలు 
వాస్తవానికి సదరు వ్యక్తికి 3,41,708 క్యూబిక్‌ మీటర్లు మెటల్‌ తవ్వకాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతకు రెట్టింపు స్థాయిలో మైనింగ్‌ చేపట్టారు. గతంలో ఈ తవ్వకాలపై ఫిర్యాదులు అందినప్పటికీ.. అప్పటి మంత్రులు మైనింగ్‌ అధికారులపై ఒత్తిడి చేసిన నేపథ్యంలో వారు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఏకంగా అనధికారికంగా 2,97,245.28 క్యూబిక్‌ మీటర్లు అధికంగా తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సర్వే నంబర్‌ 193లో 0.838 హెక్టార్లలోను, సర్వే నంబర్‌ 303లో 2.08 హెక్టార్లలోనూ వీవీఆర్‌ క్రషర్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ మైనింగ్‌కు అనుమతులు తీసుకుంది. అయితే అనుమతులు పొందిన చోటే కాకుండా మరోచోట కూడా యథేచ్ఛగాగా తవ్వకాలు జరిపినట్లు అధికారులు దాడుల్లో గుర్తించారు.  

భారీ జరిమానా 
సీతానగరంలో జరిగిన ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై స్థానికులు మైనింగ్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గనుల శాఖ రీజనల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.ప్రతాప్‌రెడ్డి బృందం దాడులు నిర్వహించింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ సంస్థలకు ఏకంగా రూ.33,02,61,364 అపరాధ రుసుం చెల్లించాలని గురువారం నోటీసులు జారీ చేశారు. జిల్లాలో ఇంతటి భారీ స్థాయిలో పెనాల్టీ వేయడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. 

జిల్లాలో మరికొన్ని అక్రమ మైనింగ్‌లపై దృష్టి 
వీటితో పాటు జిల్లాలో మరో 8 చోట్ల అక్రమ మైనింగ్‌ జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలోనే వాటిపై కూడా దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన మైనింగ్‌ మాఫియా ఆగడాలు ఇపుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.    

మరిన్ని వార్తలు