అక్రమ ఆయిల్‌ ముఠా అరెస్ట్‌

8 May, 2018 06:46 IST|Sakshi

కాకినాడ రూరల్‌: వాకలపూడి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఆయిల్‌ అమ్మకాలు నిర్వహిస్తున్న ముఠాపై సర్పవరం పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సర్పవరం సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొంగ ఆయిల్‌ ముఠా వివరాలను వెల్లడించారు. తీరప్రాంతంలో ఒకసారి ఉపయోగించిన ఆయిల్‌ను నిల్వ చేస్తూ అమ్మకాలు చేస్తున్న ఆవుల శ్రీనివాసరెడ్డి, మందపాక సూరిబాబు, పెంటకోట గంగాధర్‌లను ఎస్సై  శ్రీనివాసరెడ్డి సిబ్బంది సహాయంతో అరెస్టు చేసినట్టు వివరించారు. 

ఆవుల శ్రీనివాసరెడ్డి నుంచి ఆరు బ్యారెల్స్‌ (1200 లీటర్లు) యూజ్‌డ్‌ ఇంజన్‌ ఆయిల్, మందపాక సూరిబాబు నుంచి 75 లీటర్లు క్రూడ్‌ కాటన్‌ ఆయిల్‌ను, పెంటకోట గంగాధర్‌ అనే వ్యక్తి నుంచి 20 లీటర్ల డీజిల్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పాతనేరస్తుడైన ఆవుల శ్రీనివాసరెడ్డి వాకలపూడి ఎఫ్‌సీఐ కాలనీలో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని పాత ఇనుప వ్యాపారం షాపు నడుపుతున్నట్టు తెలిపారు. ఒకసారి ఉపయోగించిన ఇంజన్‌ ఆయిల్‌ను సేకరించి వాటిలో కొంత మంచి ఆయిల్‌ను కలిపి మంచి ఇంజన్‌ ఆయిల్‌గా చుట్టుపక్కల లారీ యజమానులకు, చిన్నచిన్న కంపెనీవాళ్లకు విక్రయిస్తూ వ్యాపారులను మోసగిస్తున్నాడన్నారు.

 సీఐ చైతన్యకృష్ణకు ముందుగా వచ్చిన  సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నామన్నారు. ఈనెల 6వ తేదీన ఏపీ5డబ్ల్యూ 1282 నంబర్‌ గల లారీ యజమాని కడలి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ వాకలపూడిలోని ఎన్‌సీఎస్‌ ఆయిల్‌ కంపెనీ నుంచి అమలాపురం, రావులపాలెం పెట్రోల్‌ బంకులకు వెళ్లేందుకు డీజిల్‌ నింపిన ట్యాంకర్‌ నుంచి డ్రైవర్‌ పెంటకోట గంగాధర్‌ ట్యాంకర్‌ కంపార్ట్‌మెంట్‌కు సీలు తొలగించి సుమారు 20 లీటర్లు డీజిల్‌ ఆయిల్‌ను దొంగిలించడంపై అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు.

 ఇదే విధంగా వాకలపూడి గ్రామంలోనే అక్రమంగా ఆయిల్‌ వ్యాపారం చేస్తున్న మంటపాక సూరిబాబుని అరెస్టు చేసి అతడి నుంచి 75 కిలోల కాటన్‌ క్రూడ్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ట్యాంకర్‌ డ్రైవర్లు, క్లీనర్ల వద్ద నుంచి కాటన్‌ క్రూడ్‌ ఆయిల్‌ కలిపి చుట్టుప్రక్కల వారిని స్వచ్ఛమైన ఆయిల్‌గా నమ్మించి అమ్మి మోసగిస్తున్నట్టు తెలియడంతో అరెస్టు చేశామన్నారు. సర్పవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పేకాట, జూదం ఆడుతున్న తొమ్మిది పేకాట కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు. నాలుగు గుట్కా కేసుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు.

 పోర్టులో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను మోసగించి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వివిధ కేసుల్లో ఉన్న పాతనేరస్తులు(ఆయిల్‌ కేసుల్లో) 15 మందిని అదుపులోకి తీసుకుని 15 కేసుల్లో బైండవర్‌ చేసినట్టు వివరించారు. ఎస్పీ విశాల్‌ గున్ని ఆదేశాల ఏరకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా పోర్టు ఏరియాలో రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచినట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు. కార్యక్రమంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై సత్యనారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు