అక్రమ చెల్లింపులకు హైలెవల్‌ కుట్ర

5 Mar, 2019 10:22 IST|Sakshi

కమీషన్‌ల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. ఖజానా లూటీకి సిద్ధం

పోలవరం హెడ్‌ వర్క్స్‌లో మరో దోపిడీకి తెరతీసిన సీఎం

ట్రాన్స్‌ట్రాయ్‌కి అదనపు బిల్లుల రూపంలో రూ.213 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి

ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన బిల్లులు ఇచ్చేశామని తేల్చిచెప్పిన కమిటీ

అదనపు బిల్లులు చెల్లించాలని సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలు పంపాలని ఆదేశం

మంగళవారం కేబినెట్‌లో ఆమోదముద్ర వేసి.. ట్రాన్స్‌ట్రాయ్‌కి లబ్ధి చేకూర్చేలా ఎత్తు

వాటితోనే సబ్‌ కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాలని నిర్ణయం  

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో మరో దోపిడీకి సీఎం చంద్రబాబు తెరతీశారు. అక్టోబర్‌ 7, 2016 నుంచి జనవరి, 2018 వరకూ చేసిన పనులకు అదనంగా రూ.213 కోట్లు ఇవ్వాలన్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ‘ట్రాన్స్‌ట్రాయ్‌’ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలని ఉన్నత స్థాయి కమిటీపై ఒత్తిడి తెస్తున్నారు. పెంచిన అంచనా వ్యయం మేరకు ట్రాన్స్‌ట్రాయ్‌ చేసిన పనులకు ఇప్పటికే బిల్లులు చెల్లించామని.. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఉన్నత స్థాయి కమిటీ స్పష్టం చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు అదనపు బిల్లులు చెల్లించడానికి సంబంధించిన ప్రతిపాదనను మంగళవారం నిర్వహించే కేబినెట్‌ సమావేశానికి పంపాలని ఆదేశించారు.  వివరాల్లోకి వెళితే పోలవరం హెడ్‌ వర్క్స్‌ను రూ.4054 కోట్లకు ట్రాన్స్‌ట్రాయ్‌ దక్కించుకుంది. కానీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న తర్వాత వ్యయాన్ని రూ.5,385.91 కోట్లకు పెంచేసింది. ఈ మేరకు ట్రాన్స్‌ట్రాయ్‌తో అక్టోబర్‌ 7, 2016న జలవనరుల శాఖ అనుబంధ ఒప్పందం (సప్లిమెంటరీ అగ్రిమెంట్‌) చేసుకుంది. అక్టోబర్‌ 7, 2016 నుంచి ఆ సంస్థను 60సీ నిబంధన కింద తొలగించే వరకూ.. చేసిన పనులకు రూ.2,362.22 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించారు. అంటే 2015–16 ధరల ఆధారంగా పెంచేసిన అంచనా వ్యయం మేరకే బిల్లులు చెల్లించినట్లుగా స్పష్టమవుతోంది.

సబ్‌ కాంట్రాక్టర్లకు రూ.418 కోట్ల బకాయిలు.. 
అంచనా వ్యయాన్ని పెంచేసిన తర్వాత ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి.. మట్టి పనులు త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌కు, ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) పునాది(డయా ఫ్రమ్‌ వాల్‌)పనులు ఎల్‌అండ్‌టీ–బావర్, కాఫర్‌ డ్యామ్‌ పునాది (జెట్‌ గ్రౌటింగ్‌) పనులు కెల్లర్, కాంక్రీట్‌ పనులు ఫూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులు బీకెమ్‌ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టు కింద సీఎం చంద్రబాబు అప్పగించారు. బిల్లులు చెల్లించేటపుడు భారీగా కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. అయితే పనులు చేసిన సబ్‌ కాంట్రాక్టర్లకు మాత్రం ప్రధాన కాంట్రాక్టర్‌ అయిన ట్రాన్స్‌ట్రాయ్‌ బిల్లులు చెల్లించలేదు. ఇదే అంశంపై సబ్‌ కాంట్రాక్టు సంస్థలు పలు సందర్భాల్లో ఆందోళన చేశాయి.. ఈ బకాయిలు సుమారు రూ.418 కోట్లకుపైగా ఉంటాయన్నది అంచనా. బకాయిలను చెల్లించకపోవడంతో జనవరి, 2018 నాటికి సబ్‌ కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. దాంతో.. ట్రాన్స్‌ట్రాయ్‌పై 60సీ నిబంధన కింద వేటు వేసి గేట్ల పనులు బీకెమ్‌కు, మిగతా పనులన్నీ నవయుగకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించేయడం ద్వారా చంద్రబాబు భారీగా కమీషన్‌లు వసూలు చేసుకున్నారు. ట్రాన్స్‌ట్రాయ్‌ బకాయిలు చెల్లించకపోవడంపై బావర్‌ సంస్థ డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ)కు ఫిర్యాదు చేసింది. డీఆర్‌ఐ రంగంలోకి దిగితే తన కమీషన్‌ల బాగోతం బయటపడుతుందని ఆందోళనకు గురైన చంద్రబాబు, ట్రాన్స్‌ట్రాయ్, సబ్‌ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల పంచాయతీని తేల్చడానికి గత నెల 13న ఈఎన్‌సీ (ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌) అధ్యక్షతన నలుగురు సభ్యలతో కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి..
పోలవరం హెడ్‌ వర్క్స్‌లో తాము చేసిన పనులకు జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ల ప్రకారం అదనపు బిల్లులు ఇవ్వాలని ఇటీవల ట్రాన్స్‌ట్రాయ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సెప్టెంబరు 7, 2016న పెంచిన అంచనా వ్యయం ప్రకారం తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని పేర్కొంది. రూ.213 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని కోరింది. ఈ ప్రతిపాదనను ఉన్నత స్థాయి కమిటీకి పంపిన సీఎం చంద్రబాబు.. దానిపై ఆమోదముద్ర వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే చెల్లించామని.. అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అదనపు బిల్లులు చెల్లించాలని సిఫార్సు చేస్తూ కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖను ఆదేశించారు. మంగళవారం నిర్వహించే కేబినెట్‌లో అదనపు బిల్లులు చెల్లించడానికి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అదనంగా చెల్లించే బిల్లులతోనే సబ్‌ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన వాటిలో 50 శాతం చెల్లించి వారి మధ్య బకాయిల పంచాయతీని తేల్చేయాలని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు