హద్దులు చెరిపి.. అటవీ ధ్వంసం

28 Jul, 2018 03:37 IST|Sakshi

మంత్రి దేవినేని ఇలాకాలో అస్మదీయుల మైనింగ్‌ బీభత్సం

జిలెటిన్‌ స్టిక్స్, రిగ్గు బ్లాస్టింగ్‌ మోతతో వన్యప్రాణులు విలవిల

అరుదైన వృక్ష సంపద నాశనం

94 క్వారీలకు హద్దులు చెరిపేసిన మైనింగ్‌ మాఫియా

రెండు కొండల మధ్య దర్జాగా రహదారి నిర్మాణం

2 వేల ట్రిప్పుల గ్రావెల్‌నూ వదలకుండా అమ్ముకున్న ఘనులు

పట్టించుకోని అధికారులు సాక్షి విజిట్‌..

కృష్ణా జిల్లాలో అడవిని ఆక్రమించి పేలుళ్లు

సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి అండదండలతో చెలరేగు తున్న మైనింగ్‌ మాఫియా అటవీ భూముల్లోనూ చొరబడి కొండలను కొల్లగొడుతోంది. కంచికచర్ల మండలం పరిటాల రెవెన్యూ పరిధిలోని కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టులో హద్దులు చెరిపేసి రాత్రిపగలు తేడా లేకుండా సాగిస్తున్న పేలుళ్లు, అక్రమ మైనింగ్‌తో వన్యప్రాణులు గజగజలాడుతున్నాయి. విలువైన వృక్ష సంపద నేలరాలుతోంది.

మంత్రి అనుచరుల అక్రమ క్వారీయింగ్‌
కంచికచర్ల మండలం పరిటాల రెవెన్యూ పరిధి దొనబండ సర్వే నెంబర్‌ 801లోని 1,204 ఎకరాల్లో 94 క్వారీలకు స్థానిక టీడీపీ నేతలు అనుమతులు తెచ్చుకున్నారు. ఒక్కోచోట 5 నుంచి 10 హెక్టార్ల లోపు మాత్రమే క్వారీయింగ్‌కు అనుమతించారు. హెక్టార్‌కు రూ.50 వేల చొప్పున రాయల్టీ చెల్లిస్తున్నారు. అయితే క్వారీయింగ్‌కు అనుమతించిన ప్రాంతంలో మూడేళ్ల క్రితమే తవ్వకాలు పూర్తయ్యాయి. ఆ తరువాత వీరి కన్ను రెవెన్యూ భూములను ఆనుకుని వెనుకవైపు ఉన్న కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌పై పడింది.

అప్పటికే క్వారీయింగ్‌ చేసిన ప్రాంతం అనుమతులు చూపిస్తూ కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయారు. అటవీ ప్రాంతంలో కొండలను నిత్యం రిగ్గు బ్లాస్టింగ్‌లతో పిండిచేస్తూ ఖనిజాలను కొల్లగొడుతున్నారు. అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రతినిధులు శుక్రవారం అక్కడకు చేరుకోవడంతో భారీ యంత్రాలను హడావుడిగా ఫారెస్ట్‌ నుంచి బయటకు తరలించడం గమనార్హం.

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సమీప బంధువులైన చల్లగుండ్ల చిన నాగేశ్వరరావు, చింతల రామ్మోహన్‌రావులతోపాటు మంత్రికి ప్రధాన అనుచరుడైన మోడరన్‌ క్రష్షర్స్‌ యజమాని తోటకూర పూర్ణ ఇక్కడ అక్రమ క్వారీయింగ్‌ నిర్వహిస్తున్నారు. మైనింగ్‌ మాఫియాకు సహకరించినందుకు ఎన్నికల సమయంలో టీడీపీకి ఇక్కడ రెండు నియోజకవర్గాల్లో నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

వణుకుతున్న వన్యప్రాణులు..
కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినట్లు 1990లో నిర్వహించిన జియలాజికల్‌ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ అపార ఖనిజ సంపదతోపాటు వన్యప్రాణులు కూడా ఉన్నాయి. జింకలు, దుప్పిలు, కణితలు, చిరుతలతో పాటు 32 రకాల జంతువులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ అటవీ ప్రాంతంలో 48 రకాల అరుదైన వృక్ష జాతులు కూడా ఉన్నాయి.

ఇక్కడ 100 హెక్టార్లలో కొండలు విస్తరించి ఉండగా ఇప్పటికే దాదాపు 80 హెక్టార్ల పరిధిలో కొండలను మైనింగ్‌ మాఫియా పిండి చేసినట్లు తెలుస్తోంది. క్వారీయింగ్‌ కోసం అరుదైన వృక్ష జాతులను నాశనం చేస్తున్నారు. జిలెటిన్‌స్టిక్స్‌ లాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలతో రిగ్గు బ్లాస్టింగ్‌లు చేస్తుండడంతో వన్యప్రాణులు భీతిల్లి  పరుగులు తీస్తున్నాయి. రాత్రి పగళ్లు తేడా లేకుండా పేలుళ్లు జరుపుతుండడంతో వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి.

హద్దులను చెరిపి..
మైనింగ్‌శాఖ అనుమతులు ఇచ్చేటప్పుడు సర్వే నిర్వహించి హద్దులు నిర్థారించాలి. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రి దేవినేని ఉమా అండదండలు ఉండడంతో పరిటాల క్వారీలకు నిర్వాహకులు హద్దులే లేకుండా చేశారు. 94 క్వారీలకు హద్దులు ఏమిటో అంతుబట్టవు. హద్దులు చెరిపేసి రెవెన్యూ, ఫారెస్ట్‌ భూముల్లోకి  చొచ్చుకుపోతున్నారు.

రెండు కొండల మధ్య రహదారి..
దొనబండలో క్వారీ నిర్వాహకులు 801 సర్వేనెంబర్‌లోని కొండ పోరంబోకు భూములతోపాటు కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో కలిసే రెండు కొండలను తొలిచేశారు. రెండు కొండల మధ్య అనుమతులు లేకుండా 40 అడుగుల మేర దాదాపు రూ.3 కోట్లతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఇందులో ట్విస్ట్‌ ఏమిటంటే అక్కడ లభ్యమైన 2 వేల ట్రిప్పుల గ్రావెల్‌ను కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇందులో మంత్రి అనుచరులు కీలకంగా వ్యవహరించడంతో రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్‌ అధికారులు మౌనం దాల్చారు.

అడవిని ఆక్రమించారు..
దొనబొండ క్వారీ నిర్వాహకులు పోరంబోకు, అటవీ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వేల టన్నుల కంకర తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయి క్వారీయింగ్‌ చేయడంపై అటవీశాఖకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మంత్రి అనుచరులు కావడంతో వారి ఆడిందే ఆటగా ఉంది. – మార్తా శ్రీనివాసరావు (స్థానికుడు, పరిటాల)

అటవీ భూముల్లో తవ్వకాలే లేవు..
కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌ జరగటం లేదు. రెవెన్యూ  భూముల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకవేళ అటవీ ఆక్రమణ జరిగి ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – లెనిన్‌ (అటవీరేంజ్‌ అధికారి, కంచికచర్ల)

మరిన్ని వార్తలు