కోర్టు చెబితే మాకేంటి? 

4 Jan, 2020 07:58 IST|Sakshi
కోర్టు ఆదేశాలు కాదని కొనసాగుతున్న భవన నిర్మాణం

యథేచ్ఛగా అక్రమ నిర్మాణం 

పట్టించుకోని జోన్‌–3 టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు  

న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు

రామ్‌నగర్‌ రాక్‌డేల్‌ లేఅవుట్‌లో విలువైన ఖాళీ స్థలంపై ఆక్రమణదారుడు కన్నేశాడు. నకిలీ దస్తావేజులు సృష్టించి బహుళ అంతస్థులతో భారీ నిర్మాణం చేపట్టేందుకు 2012లో జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు కూడా వెంటనే అనుమతులు ఇచ్చేయడంతో నిర్మాణం చేపట్టాడు. విషయం తెలిసి అసలు హక్కుదారుడు కోర్టును ఆశ్రయించడంతో గుడ్డిగా ఎలా అనుమతులు ఇచ్చారంటా కోర్టు అధికారులకు చీవాట్లుపెట్టి వెంటనే ప్లాన్‌ రద్దుచేసి నిర్మాణం ఆపేయాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి నిర్మాణం కొనసాగిస్తుండడం విస్మయం కలిగిస్తోంది.   

సాక్షి, విశాఖపట్నం: అక్రమానికి బరితెగిస్తే.. అధికారులే కాదు.. అపర బ్రహ్మలు అడ్డొచ్చినా ఆగేది లేదు.. అడ్డగోలుగా నిర్మాణాలు సాగించేస్తాం అన్నట్లుగా జోన్‌–3 పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జోన్‌–3 టౌన్‌ ప్లానింగ్‌లో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో న్యాయస్థానం తీర్పుల్ని కూడా తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. రామ్‌నగర్‌ దరి రాక్‌డేల్‌ లేఅవుట్‌లో టౌన్‌ సర్వేనెంబరు 1187లో ఉన్న సుమారు 3600 గజాల   స్థలం 25 ఏళ్లుగా వివాదంలో ఉంది. ఈ స్థలానికి ఆనుకుని ఉన్న ఫ్లాట్‌ నెంబర్‌ 19లో ఓ వ్యక్తి ఆ సమయంలో ఈ స్థలంపై కన్నేసి, నకిలీ దస్తావేజులు సృష్టించి 2 వేల చదరపు గజాల స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు  జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నాడు.

పూర్తిస్థాయిలో పరిశీలన చేయకుండా సంబంధిత అధికారులు నిర్మాణం చేపట్టేందుకు బిల్డింగ్‌ అప్లికేషన్‌ (బీఏ) 10567/2012/జోన్‌3 పేరున ఆగస్టు 1, 2012 తేదీన అనుమతులు కట్టబెట్టేశారు. ఇంకేముంది  అప్పనంగా సంపాదించిన స్థలంలో అడ్డగోలుగా భవన నిర్మాణం సాగించేశారు.  అసలు హక్కుదారులు కోర్టును ఆశ్రయించారు. విశాఖపట్నం ఆరో అదనపు జిల్లా జడ్జి అక్టోబర్‌ 12, 2018న జీవీఎంసీకి మొట్టికాయలు వేసి, ప్లాన్‌  రద్దుచేయాలని ఎల్‌.ఎ.నెంబర్‌ 28/2017, ఓ.ఎస్‌.నెంబర్‌ 314/2016తో ఆర్డర్‌ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆ యజమాని యథేచ్చగా ఆ అక్రమనిర్మాణ పనులను చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. నగరం నడి»ొడ్డున ఇంత పెద్ద అక్రమ నిర్మాణం సాగుతున్నా జోన్‌–3 సిబ్బంది పట్టించుకోకపోవడం వెనుక పెద్దమొత్తంలోనే ఆమ్యామ్యాలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  దీనిపై జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ విద్యుల్లతను వివరణ కోరగా.. ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉండటంతో పనులన్నీ నిలిపి వేశామని తెలిపారు. దీనికి సంబంధించిన ప్లాన్‌ కూడా అప్పట్లో రద్దు చేశామని వివరించారు. మరోసారి స్థలాన్ని పరిశీలించి  సంబంధిత జోనల్‌ అధికారుల నుంచి నివేదిక తీసుకుంటామని   వెల్లడించారు. 

మరిన్ని వార్తలు