అక్రమ బదిలీలు నిలుపు చేయాలి

10 Apr, 2017 12:18 IST|Sakshi
అరబిందో ఫార్మా కంపెనీలో అక్రమ బదిలీలు నిలుపు చేయాలని, యూనియన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దుర్మార్గమని ఇప్టూ రాష్ట్ర కార్యదర్శి పి.ప్రసాద్ అన్నారు. సమస్యలు పరిష్కారం కోరుతూ మంగళవారం మెసానిక్ టెంపుల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యం వెఖరిని తప్పు పట్టినందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులు రోడ్డున పడి 19 రోజులు గడుస్తున్నా ఇంత వరకూ కార్మిక శాఖ అధికారులు పట్టనట్టుగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఈ పోరాటానికి మహిళలు మద్దతు తెలపాలని కోరారు.
 
 కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కిన అరబిందో యాజమాన్యానికి కొమ్ముకాస్తోందని ఆరోపించారు. సంఘం హక్కుల కోసం పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికుల పోరాటానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలన్నారు. ఉద్యమాన్ని నీరుగారిస్తే సహించనని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రూపొం దించిన కార్యాచరణను వివరించారు. ఆగస్టు-2న సభ, 4న మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు, సీఎం లేఖలు, 6న కుటుంబాలతో కలసి దీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు. 10న శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు  తెలిపారు. సభలో ఇప్టూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎం.గోపాలం, కె.సన్యాసిరావు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు