హవ్వ... పరువు తీశారు!

11 Aug, 2019 09:50 IST|Sakshi
గతంలో అధికారులు పట్టుకున్న రేషన్‌ బియ్యం లారీ, చాలక ఆరుబయట ఉంచిన బియ్యం నిల్వలు

నాణ్యత లేని బియ్యం సరఫరా చేసిన జిల్లా అధికారులు

నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిన ఒంగోలు అధికారులు

గతంలో విశాఖలో జరిగిన ఘటనే  పునరావృతం

రైతులనుంచి సేకరించిన ధాన్యం మరాడించి ఇవ్వాల్సిన మిల్లర్లు రీసైక్లింగ్‌ బియ్యాన్నే అంటగడుతున్నారు. నాణ్యత లోపించినా... కిమ్మనకుండా క్వాలిటీసెల్‌ అధికారులు ఆమోద ముద్ర వేసేస్తున్నారు. ఇన్నాళ్లూ జిల్లాలో ఆ తరహా బియ్యానే పౌరసరఫరాల అధికారులు లబ్ధిదారులకు అందించారు. ఇక్కడ గోదాములు నిండిపోయేసరికి ఇతర జిల్లాలకు తరలించినపుడు అసలు బాగోతం బయట పడుతోంది. గతంలో విశాఖలో... తాజాగా ఒంగోలులో అధికారులు ఇక్కడి బియ్యాన్ని తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం జిల్లా అధికారుల పనితీరుపై ప్రభావం చూపుతోంది.

సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్ల మధ్య లోపాయికారీ ఒప్పందాలతో పేదోడి బియ్యం పక్కదారి పడుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లకు తరలిస్తున్న ధాన్యం మరాడించి ఇచ్చేందుకు ప్రభుత్వం తక్కువ మొత్తాన్ని అందజేస్తున్నా మిల్లర్ల అత్యుత్సాహానికి కారణం రీసైక్లింగేనని స్పష్టమవుతోంది. జిల్లాలోని కొందరు మిల్లర్ల     నుంచి
వస్తున్న రీసైక్లింగ్‌ బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ప్రతీ పౌరసరఫరాల గోదాములో బియ్యం తనిఖీ చేసే సాంకేతికాధికారులున్నారు.

వారిలో కొందరు మిల్లర్లు ఇచ్చిన మొత్తాలకు అలవాటు పడి నాణ్యత బాగుందంటూ ధ్రువీకరించడంతో వీటిని గోదాములకు తరలిస్తున్నారు. ఇక్కడి గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో ఇతర జిల్లాలకు తరలించే ప్రక్రియలో ఈ బాగోతం బయటపడింది. ఇటీవల ఒంగోలు తరలించిన బియ్యాన్ని తనిఖీ చేసిన అక్కడి అధికారులు వాటిలో నాణ్యత లేదనీ, ముక్కి, రంగుమారాయని తిరస్కరించారు. దీంతో ఇక్కడి నాణ్యత డొల్లతనం బయట పడింది. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులు పంచాయితీ నిర్వహించారు. 

ముక్కిన బియ్యం 800 టన్నులు?
జిల్లా నుంచి తరలిన బియ్యం దాదాపు 800 టన్నులు ముక్కి, రంగుమారిపోయినట్టు ఒంగోలులోని నాణ్య తా విభాగం అధికారులు ధ్రువీకరించినట్టు తెలిసింది. దీనిపై కమిషనర్‌ స్థాయి అధికారులు బదిలీపై వెళ్లిన జిల్లా మేనేజర్, సహాయ మేనేజర్‌లను పిలిపించిన పోస్ట్‌మార్టం నిర్వహించారు. చివరకు ఇక్కడి నాణ్యతా విభాగం డొల్లతనాన్ని ఎత్తిచూపారు. జిల్లానుంచి చిత్తూరు, విశాఖ పట్నం తదితర జిల్లాల్లోని గోదాములకూ గతంలో బియ్యాన్ని తరలించారు. ఎక్కడి నుంచి వెళ్లిన బియ్యాన్నైనా భద్రపరిచేముందు నాణ్యతా తనిఖీలు నిర్వహిస్తారు. అలాంటి సమయాల్లో ఎగుమతి చేసిన జిల్లాలోని నాణ్యతా విభాగం సిబ్బంది పనితనం తేటతెల్లమవుతుంది. ఇప్పుడదే జరిగింది. ఒంగోలులో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన బియ్యంలో కొంత భాగం సూరంపేట గోదామునుంచి తరలించినవి. వాస్తవానికి సూరంపేటలోనే కాదు. మరికొన్ని గోదాముల్లోని నాణ్యతా విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, మిల్లర్లతో మిలాఖత్‌ అయి పాడైన బియ్యాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

గతంలోనూ విశాఖలోనూ తిరస్కరణ
గతేడాది విశాఖపట్నం తరలించిన దాదాపు 40 లారీల లోడ్ల బియ్యం నాణ్యత బాగాలేదని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అక్కడి డీఎం బియ్యాన్ని తిప్పి పంపారు. కానీ ఇక్కడినుంచి సహాయ మేనేజర్‌ను పంపించి గొడవ పెద్దది కాకుండా సర్దుబాటు చేయించారనే ఆరోపణలు వినిపించాయి. ఆ తరువాత ఆ బియ్యంలో కొంత మాత్రమే ఇతర చోట్లకు పంపించారు. మిగతాది అక్కడే సర్దుబాటు చేశారని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. 

ఖరీఫ్‌ సరుకును రబీకి  మార్చిన వైనం
జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 3.40లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా ధాన్యం ఉన్నాయని మిల్లర్లు, రైతులు చెప్పడంతో మరో లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేయొచ్చని అధికారులు ఉన్నతాధికారులకు ఇక్కడినుంచి నివేదిక పంపారు. కానీ 60వేల టన్నులు కొనుగోలు చేసేందుకు నిర్ణయించి వాటిని వెంటనే ఆగమేఘాల మీద ఆన్‌లైన్‌ చేశారు. కానీ రైతులకు మాత్రం నేటికీ డబ్బు ఇవ్వలేదు. విచిత్రమేమిటంటే ఇక్కడి రబీ ధాన్యం ఇతరులు కొనుగోలు చేసుకోగా ఖరీఫ్‌లోని ధాన్యాన్నే రబీ లో కొన్నట్టుగా అధికారులు రికార్డులు సిద్ధం చేశారు. 

ఇంకా ముక్కిన బియ్యం గోదాముల్లో..
జిల్లాలోని పలు గోదాముల్లో ముక్కిన, రంగుమారిన బియ్యాన్ని నిల్వ ఉంచారు. ఈ బియ్యాన్ని అదను చూ సి ఇతర గోదాములకు మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సూరంపేట ఘటన తరువాత ఈ బియ్యాన్ని ఎక్కడిదక్కడ గప్‌చుప్‌గా దాచేసినట్టు తెలు స్తోంది. కొన్ని గోదాముల్లోని బియ్యం ఇటీవల కురిసి న వర్షాలకు మరింత పాడై తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నట్టు సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలు ఫిర్యాదు కూడా చేశారు.ఈ వైఖరిపై కొత్తగా వచ్చిన ఇన్‌చార్జి జిల్లా మేనేజర్‌ సమీక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే దీనిపై సంబంధిత శాఖా ధికారులు ఎవరూ స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు