పేదల బియ్యం.. పెద్దల భోజ్యం

22 Jul, 2014 03:10 IST|Sakshi
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం

కనిగిరి: చౌకడిపోల ద్వారా పేదవాడికి కడుపునిండా బువ్వపెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే అధికారుల అవినీతి, నిర్లక్ష్యంతో అది అక్రమార్కుల జేబులు నింపుతోంది. కనిగిరి కేంద్రంగా బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రాజకీయ నాయకుల అనుయాయులకు ఇది మంచి ఉపాధి మార్గంగా మారింది.

దీంతో అధికార పార్టీ నాయకులు డీలర్ షాపులను లాక్కునే పనిలో పడ్డారు. ఈక్రమంలో ఇతర పార్టీల వారిపై దాడులకు దిగడంతో పాటు వారిలో వారే గ్రూపులుగా మారి కొట్లాడుకుంటున్నారు. జిల్లాలో 6,74,243 తెల్లరేషన్ కార్డులు ఉండగా, రచ్చబండ రేషన్ కూపన్లు 1.26,450 వరకు ఉన్నాయి. అంత్యోదయ కార్డులు 52,155, అన్న యోజనకార్డులు 1,034 ఉన్నాయి.  జిల్లాలో మొత్తం 2,202 చౌక దుకాణాలుండగా, కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో  217 షాపులున్నాయి. నియోజకవర్గంలో 40 శాతానికిపైగా చౌక బియ్యం పక్కదారిపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.  
 
కనిగిరి నుంచి ఇతర రాష్ట్రాలకు..
అక్రమార్కులు ఈ ప్రాంతం నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని పోరుమామిళ్ల, సింగరాయకొండ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని కేజీ రూ.5 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేసి  బయట రూ.12 నుంచి రూ.17 వరకు అమ్ముకుంటున్నారు. వీరు ముందుగా గ్రామాల్లోని రేషన్ షాపుల నుంచి సేకరించిన బియ్యాన్ని చిన్నచిన్న మూటల్లో ఒకచోటికి రహస్యంగా చేర్చుతారు. ఆ తరువాత వాటిని బస్తాలు మార్చి నల్లబజారుకు తరలిస్తారు.
 
ఇప్పటి వరకు పట్టుబడినవివీ...
2012 జులైలో కనిగిరి పట్టణంలో రెండు రేషన్‌షాపుల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న సుమారు 88 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. అందులో ఒకరు బినామీ డీలరు కాగా మరొక డీలర్‌కు సంబంధించి ఒక ప్రైవేటు వైద్యశాలలో బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారు. అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో అధికారులు పట్టుకున్నారు.
 
 - ఆగస్టు నెలలో 7 క్వింటాళ్ల అక్రమ బియ్యం కనిగిరి నుంచి వేములపాడు వైపునకు ఆటోల్లో తరలిస్తుండగా మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టుకున్నారు.
 - 2012 డిసెంబర్‌లో స్థానిక 8 వార్డులో అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న లారీ కుక్కను తొక్కించింది. స్థానికులు అప్రమత్తమై వెంటపడ్డారు. లారీలో నుంచి కింద పడిన రేషన్ బియ్యం బస్తాను అధికారులకు అప్పగించారు. అదే నెలలో హనుమంతునిపాడులో కూడా రేషన్ బియ్యం బస్తాలు రోడ్డు మీదపడి ఉండడంతో అధికారులకు అప్పగించారు.
 - 2013లో ఏప్రిల్‌లో స్థానిక తాళ్లూరి కల్యాణ మండపం వీధిలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పీసీపల్లి మండలంలో తలకొండపాడు, పెద అలవలపాడు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల చౌక బియ్యాన్ని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు పట్టుకున్నారు. అలాగే మిట్టపాలెంలో ఓ ఇంటిలో నిల్వ ఉంచిన చౌక బియ్యాన్ని అజ్ఞాత వ్యక్తుల ఫిర్యాదుతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 - ఇటీవల స్థానిక కాశీనాయన గుడి వద్ద ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల రేషన్ బియ్యాన్ని అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారుల అప్పగించారు.
 - అలాగే 10 రోజుల క్రితం పీసీపల్లిలో అక్రమంగా తరలిస్తున్న  47 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇలా ఎవరైనా సమాచారం ఇస్తే..అరకొరగా దాడులు చేయడమే తప్ప గట్టి నిఘా ఉంచి అక్రమాలకు అడ్డుకట్ట వేసిన సంఘటనలు లేవు.  
 
గోతాలు మార్చి శఠగోపం
బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసి డబ్బులు సంపాదించుకోవడం ఒక తరహా అయితే, మరో తరహా అక్రమ వ్యాపారం కూడా సాగుతోంది. రకరకాల కంపెనీల పేర్లను గోతాలపై ముద్రించి రేషన్ బియ్యాన్ని అందులో నింపి సీల్ వేసి పాతిక కేజీల బస్తాలను తయారుచేస్తున్నారు.  వీటికీ రేషన్ షాపులనే అడ్డాగా మార్చుకోవడం గమనార్హం.  ఇటీవల ఒక రేషన్ షాపులో ఈ తరహా సీల్ వేసే మిషన్ కూడా పట్టుబడింది.  ఇంత జరుగుతున్నా అధికారులకు తెలియదనుకోవడం పొరపాటే. డీలర్లు, అక్రమార్కులు, అధికారులు కుమ్మక్కై తిలాపాపం, తలాపిడికెడు అన్న చందంగా దోచుకుంటున్నారు. వివిధ బియ్యం అక్రమ కేసుల్లో డీలర్ల పేర్లు బయటపడినా అధికారులు 6ఏ కేసులతో సరిపెడుతున్నారు.
 
డీలర్ షాపుల కోసం కొట్లాటలు:
రేషన్ షాపులు ప్రస్తుతం అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా మారాయి.  అధికార పార్టీ నాయకులు బలవంతంగా డీలర్ల షాపులను లాక్కుని తమ పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతున్నారు. కేవలం డీలర్ షాపు కోసం పీసీపల్లి మండలం పెద అలవలపాడులో వైఎస్సార్ సీపీకి చెందిన గోగాడి గంగయ్యను, టీడీపీ నాయకులు దారుణంగా కొట్టి చంపిన సంఘటన జరిగింది. కనిగిరి నియోజకవర్గంలో డీలర్ షాపుల కోసం టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే బాబూరావు సమక్ష ంలోనే పీసీపల్లి టీడీపీ నాయకులు కొట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే రేషన్ షాపుల అక్రమ వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందో అర్థమవుతోంది.

మరిన్ని వార్తలు