ఓట్ల పథకమే

11 Jan, 2019 03:10 IST|Sakshi

ఆక్రమించిన సర్కారీ భూములు, భవనాలను క్రమబద్ధీకరించడం ఏమిటి?

రాష్ట్రప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వాలు తెస్తున్న పథకాన్ని ఓటు బ్యాంకు పథకంగా హైకోర్టు అభివర్ణించింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఇలాంటి పథకాలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బహుమానంగా ఇస్తున్నాయని ఆక్షేపించింది. తద్వారా చట్టాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తులకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని పేర్కొంది. ఇలాంటి పథకాలు రాజ్యాంగ సూత్రాలు, ఆదేశిక సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈమేరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మనుగడలో ఉండగా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. 

రాజ్యాంగాన్ని మోసగించడమే...
‘ప్రభుత్వం తొలుత దారిద్య్ర రేఖకు దిగువన ఉంటూ ఎలాంటి నివాసం లేని కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు క్రమబద్ధీకరణ పథకాన్ని తెచ్చింది. ఆ తరువాత పేద, ధనిక, పల్లె, పట్టణం అనే తేడాలు లేకుండా 500 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి పేరుతో క్రమబద్ధీకరిస్తోంది. ఇందుకు ఉచితంగా లేదా నామమాత్రంగా రుసుము వసూలు చేస్తోంది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని స్పష్టం చేసింది.

విశాఖ, హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి...
విశాఖపట్నం, హైదరాబాద్‌లో పేద, ధనిక అనే తేడా లేకుండా ఉచితంగా 100 చదరపు గజాల వరకు సర్కారు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయని హైకోర్టు పేర్కొంది. ఆక్రమణదారుడికి అప్పటికే ఇల్లు ఉందా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోకుండా ఉచితంగా భూమిని క్రమబద్ధీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాయితీ కలిగిన పౌరులు, ఖజానాకు చేటు చేసే దిశగా రాజకీయ యంత్రాంగం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా శాశ్వతంగా ఉండేæ అధికార యంత్రాంగం నడుచుకోవడం దురదృష్టకరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఎమ్మార్వో సలహాతోనే..
అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ పునాదిని నిర్మించుకునేందుకు అక్రమార్కులకు క్రమబద్ధీకరణ లాంటి తాయిలాలు ఇస్తూ చట్టాన్ని గౌరవించే పౌరులను బాధితులుగా మారుస్తున్నారని, ఇందుకు తాము ఎంత మాత్రం అంగీకరించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసులో విశాఖ జిల్లా భీమునిపట్నం మండల తహసీల్దార్‌ ఇచ్చిన సలహాతోనే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పిటిషనర్‌ బైరెడ్ల చిన్నా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాస్తవానికి ఆమెకు ఈ ఐడియా లేదని వ్యాఖ్యానించింది. ఆమె ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వ్యక్తే కాకుండా రాజకీయ నాయకురాలు (విజయనగరం జిల్లా చెరుకుపల్లి గ్రామ సర్పంచ్‌) కూడా అని గుర్తు చేసింది. రాజకీయ వర్గాలకు సైతం క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుందా? లేదా? అన్నది ప్రభుత్వానికి పట్టడం లేదంది.

హైకోర్టులో పలు వ్యాజ్యాలు...
బైరెడ్ల చిన్నా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ జి.రాము 2016లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భీమునిపట్నం మండల తహసీల్దార్‌ను ఆదేశించింది. అయితే తహసీల్దార్‌ ఇచ్చిన సలహా మేరకు.. తాను అక్రమించుకున్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించాలంటూ బైరెడ్ల చిన్నా దరఖాస్తు చేసుకున్నారు.

ఇదిలా ఉండగానే భీమునిపట్నం మండలం తగరపువలస గ్రామం బంగ్లామెట్ట వద్ద సర్వే నెంబర్‌ 1–49–182/1లో చిన్నా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నించారు. దీనిపై చిన్నా 2017లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని జీవీఎంసీ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ 2018లో ఆమె మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. చనిపోయిన కుమారుడికి చిన్నా అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉన్నందున రెండు వారాల పాటు నిర్మాణాల కూల్చివేతపై స్టే విధిస్తున్నట్లు గత ఏడాది ఫిబ్రవరి 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ధిక్కార పిటిషన్‌ దాఖలు...
అయితే ఆ తరువాత ఈ ఉత్తర్వులను హైకోర్టు పొడిగించలేదు. చిన్నా చేపట్టిన అక్రమ నిర్మాణం విషయంలో అధికారులు చర్యలు తీసుకోలేదంటూ రాము కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు 2016లో జారీ చేసిన జీవో 118 ప్రకారం ఆక్రమిత భూమి క్రమబద్ధీకరణకు 2016 ఆగస్టులో చిన్నా దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండగానే ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం 2017 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జీవో 388 తెచ్చింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌ ఇటీవల తుది తీర్పు వెలువరించారు.

వన్‌టైం అంటూ మళ్లీ మళ్లీ..
‘సి.కుల్సుంరెడ్డి కేసులో రాష్ట్రప్రభుత్వం తదుపరి ఎటువంటి క్రమబద్ధీకరణ పథకాలను తీసుకురాబోమంటూ వాగ్దానం చేసేం దుకు సిద్ధమైంది. అయితే ఈ హైకోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ వ్యవహార శైలే ఇందుకు కారణం. ప్రతిసారీ వన్‌టైం పథకం కింద తీసుకొస్తున్నామని చెప్పడం తరువాత మళ్లీ మరో కొత్త పథకం తీసుకురావడం చేస్తూ వచ్చింది. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ అదే కొనసాగిస్తోంది. ప్రస్తుత కేసు విషయాని కొస్తే చిన్నా అమాయకంగా ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా భావించి కొన్నా రు. ఇందులో ఎటువంటి అనుమతుల్లేకుండా జీ ప్లస్‌ టూ నిర్మాణం చేపట్టారు. 500 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూమిని క్రమ బద్ధీకరిస్తామని సర్కారు పేర్కొంది.

అందులో చేపట్టే నిర్మాణాల గురించి చెప్పలేదు. నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను సమర్పించకుంటే నిర్మాణాలకు మునిసిపల్‌ అధికారులు అనుమ తులివ్వడానికి వీల్లేదు. దీనిప్రకారం సర్కారు తెచ్చిన క్రమబద్ధీకరణ పథకాన్ని చూస్తుంటే ప్రభుత్వ భూముల్ని దర్జాగా అక్రమించుకుని అందులో నిర్మాణాలు చేపట్టిన వారికి బహుమానంగా ఇచ్చేందుకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న పిటిషనర్‌ రాము వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.  

ఎలా చూసినా రాజ్యాంగ విరుద్ధమే..
ఏ రకంగా చూసినా కూడా ఈ క్రమబద్ధీకరణ పథకం రాజ్యాంగ విరుద్ధమని, అయితే ఈ పథకాన్ని తమ ముందు సవాలు చేయనందున తాము ఆ మేరకు ప్రకటన చేయడం లేదని హైకోర్టు తెలిపింది. తాము వ్యక్తం చేసిన  అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇటువంటి పథకాల గురించి ఒకవైపు ప్రచారం చేస్తూ, మరోవైపు కొత్త పథకం వచ్చేంత వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తులపై నిద్రపోవడం ప్రభుత్వానికి ఎంత మాత్రం సరికాదంది. బైరెడ్ల చిన్నా క్రమబద్ధీకరణ దరఖాస్తు విషయంలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు వారాల్లోపు తగిన నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిష్కరించే వరకు ఆమె చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేయరాదని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.

మరిన్ని వార్తలు