ఆటలో గెలిచాడు.. జీవితంలో ఓడిపోయాడు

26 May, 2016 00:54 IST|Sakshi
ఆటలో గెలిచాడు.. జీవితంలో ఓడిపోయాడు

అనారోగ్యంతో దైన్యంలో ఓ ఖోఖో క్రీడాకారుడు
కిడ్నీలు దెబ్బతిని సాయం కోసం ఎదురుచూపులు

 
అతను ఆటల్లో సత్తా చాటాడు. అనేక బహుమతులు గెలిచాడు. ఇరవై నాలుగేళ్లకే అనారోగ్యం బారినపడి మంచానికి పరిమితమయ్యాడు. రెండు కిడ్నీలు చెడిపోయి తల్లి సంరక్షణలో రోజులు గడుపుతున్నాడు. ఆస్తి అంతా వైద్య ఖర్చులకు హారతి కర్పూలంగా కరిగిపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
 

 
గురజాల : పట్టణానికి చెందిన పాలడుగు సాగర్‌బాబు ఖోఖో క్రీడాకారుడు. మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వివిధ పోటీల్లో మంచి ప్రతిభ చూపాడు. ఆల్ ఇండియా యూనివర్శిటీల ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సైతం పాల్గొన్నాడు. అనేక పతకాలు సాధించాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. రెండు కిడ్నీలు పాడవడంతో నిలబడలేక, కూర్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తల్లి ఎలిశమ్మ స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓ బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తూ భర్త లేకపోయినా కొడుకును జాగ్రత్తగా చూసుకుంటోంది.


 వెంటాడుతున్న అనారోగ్యం..
సాగర్‌బాబు 2014లో తలనొప్పి, వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడ్డాడు. వైద్యులను సంప్రదిస్తే రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. దీంతో వ్యాధి తీవ్రతను తగ్గించుకునేందుకు గుంటూరులో అతను తిరగని వైద్యశాల లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఉన్న భూములను అమ్ముకుని చికిత్సకు వ్యయం చేశారు.

నెలకు రూ.20 వేలు ఖర్చు..
సాగర్‌బాబుకు నెలలో 12 సార్లు డయాలసిస్ చేయించాలి. ఇందుకు నెలకు రూ.20 వేలు ఖర్చవుతోంది. అయితే, రెండు కిడ్నీలు మార్చాలంటే సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. తన కిడ్నీలు దానం చేద్దామంటే.. రెండు కిడ్నీల్లోనూ రాళ్లు ఉండటంతో అవి పనికిరావని వైద్యులు చెప్పారు. పోనీ ఉన్న ఇంటిని అమ్మి వైద్యం చేయిద్దామంటే అంత డబ్బు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో తోచని ఎలిశమ్మ, సాగర్‌బాబు దాతల సాయం అర్ధిస్తున్నారు. దయగల మారాజులు సెల్ నంబర్ 84660 26065 లో సంప్రదించాలని, లేదా ఎస్‌బీఐ ఖాతా 31620425917 కు సాయం సొమ్ము జమ చేయాలని క్రీడాకారుడు సాగర్‌బాబు, అతని తల్లి ఎలిశమ్మ వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు