మురుగు నీళ్లతో మధ్యాహ్న భోజనం

14 Apr, 2018 08:24 IST|Sakshi
కలుషిత ఆహారం తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

19 మంది విద్యార్థులకు అస్వస్థత

వాంతులు, విరేచనాలు, జ్వరం,

కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిక  

ఒకరిని జీజీహెచ్‌కి తరలింపు

విద్యార్థులను పరామర్శించినమర్రి రాజశేఖర్, కలెక్టర్‌

చిలకలూరిపేటటౌన్‌: బావిలోని కలుషిత నీటితో వండిన ఆహారాన్ని తిని 19 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. నాదెండ్లలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి చెందిన 90 మంది విద్యార్థులు గురువారం మధ్యాహ్న భోజనం తిని తరగతులకు వెళ్లారు. ఇందులో కొంత మందికి కడుపు నొప్పి, వాంతులు అవడంతో విశ్రాంతి తీసుకునేందుకు హాస్టల్‌కు వెళ్లారు. వీరిలో 19 మందికి తీవ్రమైన జ్వరం, వాంతులు రావడంతో హుటాహుటిన నాదెండ్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు.

అడుగడుగునా నిర్లక్ష్యం
విద్యుత్‌ సరఫరా లేని కారణంగా బావిలోని మురుగు నీటితో వంట చేశామని నిర్వాహకులు చెప్పారు. పూర్తిగా కలుషితమై మట్టితో కూడిన బావి నీటిని వంటకు వినియోగించారు. మినరల్‌ వాటర్‌ తీసుకొచ్చేందుకు నాదెండ్ల నుంచి గణపవరం గ్రామానికి 15 నిమిషాల ప్రయాణం. అక్కడి నుంచి చిలకలూరిపేటకు ఐదు నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. కానీ 90 మంది తినే ఆహారం విషయంలో నిర్వాహకుల అశ్రద్ధ స్పష్టంగా తెలుస్తోంది. 

కలెక్టర్‌ ఆగ్రహం....
సమాచారం అందుకున్న కలెక్టర్‌ కోన శశిధర్‌ సాయంత్రం నాదెండ్లకు చేరుకున్నారు. వసతిగృహం, ఆసుపత్రిని సందర్శించారు. రామాలయం సమీపంలోని కలుషిత బావిని పరిశీలించారు. ఇలాంటి నీటితో వంట ఎలా చేశారంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. ఆనంతరం విద్యార్థులను పరామర్శించారు. కలెక్టర్‌ వెంట ఉప వైద్యాధికారి శ్యామల, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు మల్లికార్జునరావు, నిరీక్షణరావు, ఇతర అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు