ఉప్పు రైతు డీలా!

24 Jun, 2014 04:02 IST|Sakshi
ఉప్పు రైతు డీలా!

- ధరల పతనంతో ఆందోళన
- పెట్టుబడులు దక్కని వైనం
- పేరుకుపోయిన ఉప్పు నిల్వలు

సింగరాయకొండ : ఉప్పు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండలంలో ఊళ్లపాలెం, పాకల, బింగినపల్లి ప్రాంతాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో  రైతులు ఉప్పు పండిస్తున్నారు. పాకలలో సుమారు 100 ఎకరాలు, ఊళ్లపాలెంలో సుమారు 2,700, బింగినపల్లిలో 1200 ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని భూములను లీజుకు తీసుకుని రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఎండల కారణంగా ఉప్పు తయారీ గణనీయంగా పెరగడంతో ధరలు పడిపోవమేకాక, ఉత్పత్తికి తగ్గ అమ్మకాలు లేక ఉప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. 70 కిలోల బస్తా ఉప్పు తయారీకి సుమారు రూ.90 ఖర్చవుతుండగా, ప్రస్తుతం మేలు రకం ఉప్పు బస్తా ధర రూ.75 మాత్రమే పలుకుతోంది. నాణ్యత కొంచెం తగ్గిన ఉప్పు బస్తా ధర రూ.50గా ఉంది. ప్రస్తుతం ఉప్పు ధరకు, తయారీ ఖర్చుకు  పొంతన లేకపోవడంతో నష్టానికి అమ్ముకోలేక, నిల్వ ఉంచుకోలేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో సొంత భూములున్న కొందరు రైతులు ఉప్పు పండించడం మానుకోగా, లీజుదారులు మాత్రం ఉప్పు సాగు చేసినా, మానేసినా ఆర్థికంగా నష్టపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన కూలి రేట్లు, డీజిల్ ధరలతో ఉప్పు తయారీ భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు తీవ్రంగా ఎండలు కాస్తుండడంతో తయారయ్యే ఉప్పు చేదుగా ఉంటోందని, ఇది అమ్మకానికి పనికి రాదని ఉప్పు రైతులు తెలిపారు.

సాధారణంగా జూన్ నాటికి రాష్ట్రం మొత్తం మీద కొన్నిప్రాంతాల్లోనైనా వర్షాలు పడేవని, దీనివల్ల మిగతా చోట్ల తయారైన ఉప్పుకు డిమాండ్ ఉండేదని, ప్రస్తుతంలో రాష్ట్రంలో ఎక్కడా వాన జాడ లేకపోవడంతో అన్ని ప్రాంతాల్లో గణనీయంగా ఉత్పత్తి జరిగి ఎగుమతులు లేవని ఉప్పు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు ఎప్పుడు పడతాయో, గిట్టుబాటు ధర లభించి తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఉప్పు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు