పేదలపై భారం పడదు

1 Apr, 2020 04:15 IST|Sakshi

99%  వినియోగదారులపై భారమే లేదు

నేటి నుంచే కొత్త విద్యుత్‌ టారిఫ్‌ అమలు

దొడ్డిదారిన చార్జీల వడ్డన ఎత్తివేత

పేద, మధ్య తరగతికి ఊరటనిచ్చేలా బిల్లులు

500 యూనిట్లు దాటితేనే సంపన్నులపై స్వల్ప వడ్డన

సాక్షి, అమరావతి: పేదలపై పైసా కూడా భారం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కొత్త విద్యుత్‌ టారిఫ్‌ అమలులోకి రానుంది. 2020–21 టారిఫ్‌ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఫిబ్రవరిలోనే వెలువరించింది. గత ఐదేళ్లుగా అనుసరించిన టారిఫ్‌కు ఇది పూర్తి భిన్నంగా ఉంది. దొడ్డిదారిన ప్రజలపై భారం మోపే విధానాలకు కమిషన్‌ స్వస్తి పలికింది.

ప్రజలకు ఊరట.. సర్కారుపైనే భారం
పేద, మధ్య తరగతి వర్గాలపై పైసా కూడా భారం పడరాదని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా డిస్కమ్‌లకు ఈసారి రూ.10,060.63 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ వినియోగానికి రూ.1,707.07 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. 
► విద్యుత్‌ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధిక భారం మోపే విధానాన్ని గత సర్కారు ఐదేళ్లుగా అమలు చేసింది. దీన్ని ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశారు. ఏ నెలలో ఎంత విద్యుత్‌ వినియోగిస్తారో టారిఫ్‌ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేస్తారు. దీనివల్ల 50 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. 
► రాష్ట్రంలోని 1.45 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారుల్లో నెలకు 50 యూనిట్లు వినియోగించేవారు దాదాపు 50.90 లక్షల మంది ఉన్నారు. వీరి బిల్లు ఇప్పుడు (యూనిట్‌ రూ.1.45 చొప్పున) నెలకు రూ.72.50కి మించదు.
► ఇక నెలకు 51–75 యూనిట్లు విద్యుత్‌ వాడే వారి సంఖ్య 22.47 లక్షలు ఉంది. వీరికి గతంలో రూ.137.50 చొప్పున బిల్లు వస్తుండగా ఇప్పుడు కూడా అంతే రానుంది. (50 యూనిట్ల వరకూ యూనిట్‌ రూ.1.45 చొప్పున లెక్కిస్తారు. మిగిలిన 25 యూనిట్లకు యూనిట్‌ రూ.2.60 చొప్పున చెల్లించాలి). తద్వారా దాదాపు 74 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు ఒక్కపైసా కూడా కరెంట్‌ బిల్లు పెరిగే ప్రసక్తి ఉండదు.
► వినియోగం నెలకు 75 యూనిట్లు దాటిన వారికి కొత్త టారిఫ్‌ ప్రకారం బిల్లు తగ్గే వీలుంది. గతంలో 75 యూనిట్లు దాటితే ‘సి’ కేటగిరీ కింద పరిగణించేవారు. అంటే ఏడాదికి 900 యూనిట్లకు బదులు అదనంగా ఒక్కయూనిట్‌ వాడినా కేటగిరీ మారతారు. ఇప్పుడు ఏ నెలలో బిల్లు ఆ నెలలోనే వస్తుంది కాబట్టి చాలామందికి కరెంట్‌ బిల్లులు తగ్గే అవకాశం ఉంది.
► 101–200 యూనిట్ల విద్యుత్తు వినియోగించేవారు రాష్ట్రంలో 37.28 లక్షల మందే ఉన్నారు. 201–225 యూనిట్ల వాడకం ఉన్న వారు కేవలం 6.28 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వినియోగం తగ్గితే వీరు కూడా తక్కువ రేటు ఉండే శ్లాబులోకి వెళ్తారు. 

ప్రజాభిప్రాయం మేరకే..
‘విద్యుత్‌ బిల్లుల భారం ప్రజలపై పడకూడదన్న ప్రభుత్వ విధానం మేరకు టారిఫ్‌ ఆర్డర్‌ రూపొందించాం. ప్రజాభిప్రాయాన్ని సేకరించాం. ఏడాదిలో క్రితం టారిఫ్‌ను లెక్కలోకి తీసుకుని సంవత్సరం పొడవునా బిల్లుల మోత ఏమిటని ప్రజలు ప్రశ్నించారు. అందుకే ఇలాంటి పద్ధతులను తొలగించాం. అన్ని వర్గాలకు ఊరట కల్పించేలా టారిఫ్‌ ప్రకటించాం. లాక్‌డౌన్‌ సమయంలోనూ ప్రజలపై భారం లేకుండా చేయగలిగామనే సంతృప్తి ఉంది’

మరిన్ని వార్తలు