ఆధార్‌తోనే సంక్షేమ పథకాల అమలు

26 Aug, 2014 03:05 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్ :  అక్టోబరు 2 నుంచి ప్రభుత్వ పథకాలన్నీ బ్యాంకు ఖాతాలు, ఆధార్ సీడింగ్‌తోనే అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్ తెలిపారు. ప్రతి కుటుంబానికి రెగ్యులర్ బ్యాంకు ఖాతాతోపాటు పొదుపు ఖాతాను కూడా ప్రారంభించాలని తెలిపారు. ఈ అంశంలో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేసేందుకు  కలెక్టరు సొలమన్ ఆరోగ్యరాజ్ తీసుకుంటున్న చొరవను అభినందించారు. మిగతా జిల్లాలు కూడా ఈ ప్రక్రియను పాటించాలని సూచించారు.
 
సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్‌లతో మాట్లాడారు. ప్రతి కుటుంబానికి లబ్ధిచేకూర్చేప్రధానమంత్రి జన-ధన యోజన పథకాన్ని ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.  మన రాష్ట్రంలో ఇదే సమయానికి ప్రతి జిల్లాలో ప్రధానమంత్రి జన - ధన యోజన ఖాతాలను పంపిణీ చేయాలని తెలిపారు.     
 
ఆంధ్రబ్యాంకు జనరల్ మేనేజరు, రాష్ట్ర స్ధాయి బ్యాంకర్స్ సంప్రదింపుల కమిటీ కన్వీనరు దొరైస్వామి మాట్లాడుతూ  ప్రతి పొదుపు ఖాతాకు రూ.లక్ష  జీవిత బీమా సదుపాయాన్ని కల్పిస్తూ రూపే కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో జేసీ సత్యనారాయణ, బ్యాంకింగ్ నిపుణులు రామిరెడ్డి, వెంకట్వేరరావు, ఎల్‌డీఎం జయశంకర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు