దిగుబడులు అంతంతే!

18 Sep, 2014 02:09 IST|Sakshi
దిగుబడులు అంతంతే!
  • సగానికి పడిపోనున్న ఆహారధాన్యాల ఉత్పత్తి
  •   ఖరీఫ్‌లో 75 శాతానికి దిగజారిన వరి పంటలు
  •   68 శాతానికే పరిమితమైన పప్పుధాన్యాల సాగు
  •   రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్లే దుస్థితి
  •   వ్యవసాయ శాఖ నివేదికలో తాజా అంచనాలు
  •  సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. నెలాఖరుతో సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో పంటల సాగు సాధారణం కన్నా 20 శాతం తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఈసారి రుతుపవనాలు నిర్ణీత సమయంలో రాకపోవడమే ఇందుకు కారణం. చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన పంటల పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. ఫలితంగా ఖరీఫ్‌లో ఆహారధాన్యాల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ ఆందోళన చెందుతోంది. అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్‌లో రాష్ర్టంలో 20.60 లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాల సాగు జరగాల్సి ఉండగా.. 16.41 లక్షల హెక్టార్లలోనే(80%) పంటలను వేశారు. అందులో వరి 10.04 లక్షల హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా.. 7.53 లక్షల హెక్టార్లకే(75%) పరిమితమైంది. ఇక పప్పుధాన్యాలు 4.92 లక్షల హెక్టార్లకు బదులు కేవలం 3.35 లక్షల హెకార్టలో(68%) సాగవుతోంది. ఈ మేరకు పంటల పరిస్థితిపై వ్యవసాయ శాఖ బుధవారం తాజా నివేదికను విడుదల చేసింది. నూనె గింజల సాగు మాత్రం 119 శాతం జరిగిందని పేర్కొంది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఆలస్యంగా పంటలు వేయడంతో దిగుబడి భారీగా తగ్గవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 66.37 లక్షల టన్నులు. అందులో వరి 57.31 లక్షల టన్నులు కాగా, పప్పుధాన్యాల లక్ష్యం 3.22 లక్షల టన్నులు, నూనెగింజల లక్ష్యం 5.58 లక్షల టన్నులుగా ఉంది. అయితే ఈసారి దిగుబడులు ఇందులో సగానికి పడిపోయే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
     
     316 మండలాల్లో లోటు వర్షపాతం
     ఇటీవల కొంతమేర వర్షాలు కురిసినా.. అంతకుముందు జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో వర్షపాతం కొరత ఇంకా ఎక్కువగానే ఉంది. ఇప్పటికీ 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 8 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. కేవలం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మండలాలవారీగా పరిశీలిస్తే 316 మండలాల్లో వర్షపాతం కొరత ఉంది. 19 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. కేవలం 106 మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. 23 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికంగా 16 మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలోనివే. రంగారెడ్డిలో 4, వరంగల్‌లో రెండు మండలాలు ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు పెద్దగా పెరగలేదు. ఇప్పటికీ తెలంగాణలో గత ఏడాదితో పోల్చితే సాధారణం కన్నా 2.17 మీటర్ల అదనపు లోతులోనే జలాలు ఉన్నాయి. లోటు వర్షపాతం కారణంగా చెరువులు పెద్దగా నిండకపోవడంతో రబీ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. 
     
మరిన్ని వార్తలు