క్షతగాత్రులకు మెరుగైన వైద్యం

28 Jun, 2014 03:33 IST|Sakshi
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం

- ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం, కేంద్ర, రాష్ర్ట మంత్రులు
మామిడికుదురు/కాకినాడ క్రైం : నగరం పైపులైన్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వ పరంగా మెరుగైన  వెద్యసహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్‌తో కలిసి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం మధురపూడి చేరుకున్నారు.

అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో నగరం చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓఎన్జీసీ డౌన్‌డౌన్ అంటూ సీఎం ఎదుట నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రావాల్సిందిగా బాధితులు పట్టుబట్టినప్పటికీ పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేశారు.

అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడులతో కలిసి కాకినాడ చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, బీజేపీ ఏపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తదితరులతో కలిసి కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ వారికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాలు ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
 
స్థానికుల నిరసన
ఒకే కుటుంబంలో ఐదుగురు మృత్యువాత పడిన ఇంటిని కానీ, మరో కుటుంబంలో ముగ్గురు చనిపోయిన ఇంటిని కానీ చంద్రబాబు పరిశీలించకుండానే వెనుదిరగడంపై స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఎంతో హడావిడి చేసి పోలీసు బందోబస్తు మధ్య ఎవరిని ఉద్దరించడం కోసం ఇక్కడకు వచ్చారంటూ బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెంట వచ్చిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రోడ్డుపైన కారు దిగి, రోడ్డుపైనే నిలుచుని మళ్లీ అక్కడ నుంచే వెనుదిరిగారే తప్ప సంఘటన స్థలంలో కనీసం కాలుమోపలేదు.

>
మరిన్ని వార్తలు