అభివృద్ధి రికార్డులకే పరిమితం

12 Jan, 2014 03:10 IST|Sakshi

 నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : ఆర్టీసీలో అభివృద్ధి అనేది రికార్డులకే పరిమితమైంది. జిల్లా కేంద్రంలోని రెండు బస్‌స్టేషన్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ప్రయాణికులు కూర్చునేందుకు అనువైన కుర్చీలు, బల్లలు కూడా లేవంటే ఈ బస్‌స్టేషన్లు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
 
 గ్యారేజీలో మిగిలిపోయిన, తుప్పు పట్టిన కమ్ములను వెల్డింగ్ చేసి కుర్చీలుగా వినియోగిస్తున్నారు. బస్సుల కోసం వేచి చూడటంలో భాగంగా విసుగు చెందకుండా కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన టీవీలు అమావాస్యకు, పౌర్ణానికి మాత్రమే పనిచేస్తున్నాయి. ఒకవేళ టీవీలు పని చేస్తున్నప్పుడు ప్రకటనలతో ఊదరగొట్టడం తప్ప ప్రయాణికులకు అవసరమైన సమాచారం, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలకు చోటులేదనే విమర్శలున్నాయి.
 
 మరుగుదొడ్ల పరిస్థితి అంతంత మాత్రమే. బస్టాండ్ ప్రాంగణంలో కాంట్రాక్టర్ నిర్వహణలో ఉన్న మరుగుదొడ్లలో మలవిసర్జనకు రూపాయి మాత్రమే వసూలు చేయాల్సి అంతకు ఐదింతలు ప్రయాణికుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు స్టేషన్ల అభివృద్ధి పేరుతో ప్రయాణికుల నుంచి ప్రతి టికెట్‌పై రూపాయి (డెవలప్‌మెంట్ సెస్సు) వసూలు చేస్తున్నారు. రీజియన్ పరిధిలో ఈ విధంగా వసూలు చేసిన డబ్బు లక్షల్లో ఉంటుంది. ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ వారికి సౌకర్యాలు కల్పించడంలో చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 బస్సుల కండీషన్ అధ్వానం
 ప్రధాన నగరాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు చూసేందుకు ఒకింత అందంగా కనపడినా  గ్రామీ ణ  బస్సుల్లో సీట్లు చిరిగి, రేకులు, చీలలు పైకి లేచి  అధ్వానంగా ఉన్నాయి. 2వ డిపో  నుంచి వివిధ గ్రామాలకు  కాలం చెల్లిన బస్సులనే నడుపుతుండటంపై విమర్శలు ఉన్నాయి. సాధారణంగా 12 లక్షల కిలో మీటర్లు తిరిగిన బస్సును పాత ఇనుము కింద విక్రయించాలి. అయితే రీజియన్ పరిధిలోని 862 బస్సుల్లో సగానికి పైగా బస్సులు 30 లక్షల కిలో మీటర్లు తిరిగినవేనని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. కేవలం డ్రైవర్ల నైపుణ్యం, అంకిత భావం వల్లే ఈ బస్సులను రోడ్లపై నడిపి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు  చేర్చడమే కాకుండా బస్సును తిరిగి సురక్షితంగా డిపోలో అప్పగిస్తున్నారు.
 
 పేరుకే ‘సూపర్’.. లగ్జరీ కరువే
 ఆర్టీసీ గరుడ బస్సుల తర్వాత అధిక చార్జీలు వసూలు చేసేది సూపర్ లగ్జరీ బస్సుల్లోనే. మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ఆదరించేది, ప్రయాణించేది సూపర్ లగ్జరీ బస్సుల్లోనే. ఈ బస్సుల్లోనూ వసతులు అరకొరగానే ఉన్నాయి. పలు బస్సుల్లో టీవీలు పని చేయడం లేదు.
 
 దుర్గంధభరితంగా ప్రధాన బస్‌స్టేషన్
 ప్రధాన బస్‌స్టేషన్ ప్రవేశ ద్వారంలోనే పలువురు మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో ప్రవేశంలోనే ఎవరైనా ముక్కులు మూసుకోవాల్సిందే. బస్‌స్టేషన్‌ల్లోని మరుగుదొడ్లలో  నగదు వసూలు చేస్తుండటంతో ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
 బస్‌స్టేషన్‌లో రోడ్లు అధ్వానం
 బస్‌స్టేషన్లో రోడ్డు పగుళ్లిచ్చి గుంత లు ఏర్పడి  ఉన్నాయి. పక్కనే ఉన్న హోటల్ నుంచి వచ్చే వ్యర్థపు నీరు, బస్‌స్టేషన్ ఎదురుగా  ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ నుంచి వచ్చే మురుగు నీరు ఈ గుంతల్లో నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది.
 
 ప్రయాణికులకు అసౌకర్యం కలగనివ్వం :
 ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి  అసౌకర్యం కలగనివ్వం. బస్‌స్టేషన్‌లో అనునిత్యం పారిశుధ్య చర్యలు చేపడతాం. 24 గంటలు తాగునీరు అందుబాటులో  ఉంటుంది.  ప్రయాణికుల రద్దీ అధికంగా  ఉన్న మార్గాల్లో  అదనపు బస్సులు నడుపుతున్నాం.  
 - చింతా రవికుమార్, ఆర్‌ఎం
 

మరిన్ని వార్తలు