ట్రెజరీ పనుల్లో స్తంభన

20 May, 2014 02:11 IST|Sakshi
ట్రెజరీ పనుల్లో స్తంభన
  •     రెండు రోజులుగా సర్వర్ సమస్య
  •      జీతాల చెల్లింపులకు అంతరాయం
  •      బిల్లుల సమర్పణకు ముగిసిన గడువు
  •      పొడిగింపు ఉత్తర్వులు ఇంతవరకు అందలేదు
  •      విభజన నేపథ్యంలో స్పష్టతలేని వైనం
  •  సాక్షి,చిత్తూరు : జిల్లా ట్రెజరీతో పాటు, మదనపల్లె, తిరుపతి, పుత్తూరు, చిత్తూరు సబ్ ట్రెజరీల్లో సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సేవలు స్తంభించాయి. సర్వర్ కనెక్టు కావడం, తిరిగి ఆగిపోతుండటంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని ట్రెజరీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

    ఈ క్రమంలో ట్రెజరీ బిల్లుల మంజూరు, ఇతర లావాదేవీలకు అనుమతి ఇవ్వాలన్నా, ఆర్థిక శాఖ సైట్‌లో వివరాలు పొందుపరచాలన్నా, అనుమతులు పొందాలన్నా, వివిధ హెడ్ అకౌంట్ల వివరాలు తెలుసుకోవాలన్నా అంతరాయం కలుగుతోంది. ప్రభుత్వ కార్యకలాపాలకు, వివిధ శాఖల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతోంది.
     
    జీతాలకు ఇబ్బందే.....


    మే నేల జీతాలకు సర్వర్ సాంకేతిక సమస్యతో పాటు, రాష్ట్ర విభజన ఎఫెక్ట్ పడనుంది. జిల్లాలో 40 వేల మందికిపైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపులో జాప్యం ఏర్పడే పరిస్థితి. బిల్లుల సమర్పణకు 19వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఇంకా కొన్ని శాఖల నుంచి జీతాల బిల్లులు ట్రెజరీలకు అందలేదు. అదే సమయంలో సర్వర్‌డౌన్ కావటంతో వివిధ శాఖలు ఇచ్చిన జీతాల బిల్లులను ట్రెజరీల్లో వివరాలు అప్‌లోడ్‌చేసి పాస్ చేసే పరిస్థితి లేదు.

    బిల్లు పాస్ చేసేందుకు గడువు పొడిగింపునకు సంబంధించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ క్రమంలో ట్రెజరీ అధికారులు ఎలా చేయాలి, ఏం చేయాలని తర్జనభర్జన పడుతున్నారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అకౌంట్లతో కార్యకలాపాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కసరత్తు చేశారు.

    అందులో భాగంగా ఈ నెల 24వ తేదీనే ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేసి కార్యకలాపాలు ముగించాలని నిర్ణయించారు. ఆ తరువాత తెలంగాణ వేరుగా, సీమాంధ్ర(ఆంధ్రప్రదేశ్) వేరుగా ఆర్థికశాఖ కార్యకలాపాలు నిర్వహించుకుంటాయి. అప్పటి నుంచి కొత్తరాష్ట్ర ట్రెజరీ కార్యకలాపాలు ఒక వారం ముందు నుంచే మే 25వ తేదీ నుంచే ప్రారంభించి నిర్వహణాపరమైన సమస్యలు ఏవైనా తలెత్తితే గమనించి సరిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సర్వర్ సక్రమంగా పనిచేయని కారణంగా ఈ నెల 24వ తేదీకి జీతభత్యాల చెల్లింపులు చెల్లించే పరిస్థితి కనపడటం లేదు.
     
    రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి.....

    చిత్తూరు జిల్లాతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ డౌన్‌కావటం మూలంగా అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా ట్రెజరీ అధికారి పాలేశ్వర్‌రావు తెలిపారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సమస్య కనుక ప్రభుత్వ స్థాయిలో చర్యలుచేపట్టాల్సి ఉందన్నారు. జీతాల బిల్లులు పాస్ చేసేందుకు గడువు పొడగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇంకా అందలేదన్నారు.
     

మరిన్ని వార్తలు