‘బండ’పై నొక్కుడు

14 Dec, 2014 02:25 IST|Sakshi
‘బండ’పై నొక్కుడు

ఒక గ్యాస్ సిలిండర్‌పై రూ.40 అదనం
జిల్లా మొత్తంమీద రోజుకు రూ.7 లక్షలు  
బలవంతపు వసూళ్లు లేదంటే సిలిండర్ ఇవ్వరు

 
జిల్లాలో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే వ్యక్తులు ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతూ దౌర్జన్యం చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌కు నిర్ణయించిన నగదు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం తెలిసినా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చోద్యం చూస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది.
 
రోజుకు రూ.7లక్షలు.. నెలకు రూ.2 కోట్లుపైనే
 
చిత్తూరు (అర్బన్): ప్రజలు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకుంటే కంపెనీ డెలివరీ బాయ్స్  సిలిండర్లు ఇవ్వడం ఆనవాయితీ.  గృహ అవసరాలకు ఆధార్ నెంబరు సీడింగ్‌లో ఉన్న వాళ్లు ఒక్కో ిసిలిండరుకు రూ.818.50 చెల్లించాలి. ఇందులో ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలో వారం రోజుల్లో జమ అవుతుంది. ఆధార్ లేనివారు ిసిలిండరుకు రూ.440 చెల్లిస్తున్నారు. జిల్లాలో మొత్తం 71 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. అన్ని ఏజెన్సీల నుంచి రోజుకు 17,500 సిలిండర్లు డెలివరీ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లను డెలివరీ ఇచ్చే సమయంలో ప్రతి ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం నగదు వివరాలను కంప్యూటర్ రశీదులో పొందు పరచి డెలివరీ బాయ్స్ వద్ద ఇచ్చి పంపుతున్నారు. ిసిలిం డర్ వినియోగదారుడికి డెలివరీ అయ్యే సమయానికి కంప్యూటర్ బిల్లుతో పాటు అదనంగా ప్రతి సిలిండర్‌కు రూ.40 వసూలు చేస్తున్నారు. దీనిపై విని యోగదారులు డెలివరీ బాయ్స్ తో గొడవ పడుతున్నారు. బిల్లు కాకుండా ఎందుకు అధిక మొత్తంలో ఇవ్వాలని అడుగుతుంటే.. తమకు గ్యాస్ కంపెనీలు జీతాలు ఇవ్వడం లేదని, ప్రతి సిలిండర్‌పై రూ.40 వసూలు చేసుకోమని నిర్వాహకులే చెబుతున్నారని డెలివరీ బాయ్స్ అంటున్నారు. ఇందులో నిజానిజాలను పక్కన పెడితే జరుగుతున్న దందాపై ఏ అధికారి గానీ, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గానీ నోరు మెదపడం లేదు. అదనంగా డబ్బు ఇవ్వకుంటే సిలిండరు ఇచ్చేది లేదంటూ కొన్ని ప్రాంతాల్లో వెనక్కు తీసుకెళ్లిపోతున్నారు. ఇలా జిల్లా మొత్తం మీద ఒక్కరోజుకు దాదాపు 17,500  ిసిలిండర్లు డెలివరీ చేస్తూ ప్రజల నుంచి రూ.7 లక్షలు బలవంతంగా వసూలు చేస్తున్నారు.
 
తానే కూలీ... మరో ఇద్దరు అసిసెంట్లు..!
 
గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్స్ రోజుకు వేలాది రూపాయలు సంపాదించడంతో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి కూడా తానే ఉపాధి కల్పిస్తున్నారు. వేలాది ఇళ్లు ఉన్న ప్రాంతానికి ఒకే వ్యక్తి సిలిండర్లు పంపిణీ చేయడం సాధ్యం కాదు. అందుకే తాను ఓ ఏజెన్సీలో జీతం తీసుకుంటున్నా... సంస్థతో సంబంధం లేకుండా మరో ఇద్దరిని అసిస్టెంట్లుగా నియమించుకుంటున్నాడు. ఆ ఇద్దరు సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ చేయడం వారి నుంచి   అదనంగా ముక్కుపిండి మరీ కనీసం రూ. 50 వసూలు చేస్తున్నారు. ఆ మొత్తం ప్రధాన గ్యాస్ డెలివరీ బాయ్ సగం, మిగతా ఇద్దరు సగం మొత్తం పంచుకుంటుంటారు. ఇళ్ల వద్ద ఇదేమని ప్రశ్నిస్తే మాత్రం సిలిండర్ కావాలా? తీసుకుని వెళ్లిపోవాలా? అని దబాయిస్తున్నారు. ఈ తరహా సంపాదనతోనే చాలామంది గ్యాస్ డెలివరీ బాయ్స్ రూ. లక్షలకు పడగలెత్తుతున్నారు.  ఇంకొందరు వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారు.
 
చట్టరీత్యా చర్యలు..
 
అదనపు డబ్బులు వసూలు చేయొద్దని ఇప్పటికే పలుమార్లు ఏజెన్సీల నిర్వాహకుల్ని హెచ్చరించాం. డెలివరీ బాయ్స్‌కు సక్రమంగా వేతనాలు ఇస్తే ఇలాంటి ఫిర్యాదులు రావు. ఐదు కిలోమీటర్ల పరిధి వరకు డెలివరీ చేసే సిలెండర్లకు ఎలాంటి రవాణా చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా డోర్ డెలివరీ ఇవ్వాలి. దీనిపై వారం రోజుల్లో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని చెబుతాం. మాట వినకుంటే కలెక్టర్‌తో చర్చించి ఏజెన్సీలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అధికారులెవరైనా ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నట్టు ప్రజలు ఫిర్యాదు చేస్తే విచారించి వారిపై కూడా చర్యలు తీసుకుంటాం.
 - విజయరాణి,
 జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారిణి
 
 

మరిన్ని వార్తలు