ఉత్తుత్తి ఉచితం

3 Sep, 2013 01:41 IST|Sakshi

నర్సీపట్నం, న్యూస్‌లైన్ : పేరుకే ఉచితం.. రైతన్న విషయంలో స్పందన మాత్రం అనుచితం! ఉచిత విద్యుత్తు విషయంలో ప్రభుత్వం వైఖరి ఇదీ..  జిల్లా వ్యాప్తంగా ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ బెంబేలెత్తించే విధంగా ప్రభుత్వం తీరు ఉంది. రెండు విడతలుగా ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్టు అధికారులు ప్రకటిస్తున్నా  క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పగటి పూట ఇస్తున్న మూడున్నర గంటల్లో గంటన్నర పూర్తిగా ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రి విషయానికొస్తే కరెంటు వచ్చే సమయానికి రైతులు వెళ్తున్నా, మధ్యలో కోతలు విధిస్తున్నారు. నాలుగైదు సార్లు ఇలా చేస్తుండటంతో విసుగు చెందుతున్న రైతులు, ఇళ్లకొచ్చి మళ్లీ పొలాలకు వెళ్లడం లేదు.

ఈ నేపథ్యంలో ఏడుగంటల ఉచిత విద్యుత్తని అధికారులు చెబుతున్నా,  క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోపగపడేది మూడు గంటలే. ఇదేకాకుండా  దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్న సమయంలో ఇచ్చిన ఉచిత విద్యుత్‌కు బిల్లులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఒక్కో కనెక్షనుకు సర్వీసు చార్జీ కింద నెలకు రూ. 20 మాత్రమే వసూలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఒక్కోదానికి లక్షల్లో బిల్లులు వస్తుంటే ఎలా చెల్లించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా సుమారుగా 28 వేల వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి వినియోగానికి రోజుకు ఇరవై లక్షల యూనిట్ల విద్యుత్తు అవసరం అవుతుంది. ప్రస్తుతం జిల్లాకు సరిపడా విద్యుత్ పంపిణీ లేక అన్ని రంగాలకు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బోర్లపై ఆధారపడి సాగు చేసిన భూముల్లో పెట్టుబడులైనా వస్తాయంటే అనుమానమేనని రైతులు లబోదిబో మంటున్నారు.
 

మరిన్ని వార్తలు