కూర‘గాయాలు’ ధరల కాక

10 Nov, 2013 01:08 IST|Sakshi

 

కొనలేం.. తినలేం..
 =భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు
 = కార్తీకమాసం ఎఫెక్ట్
 =కొండెక్కిన ధరలతో సామాన్యుల బెంబేలు

 
పెడన, న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం, కార్తీక మాసం ప్రభావంతో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆకు కూరలు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. కార్తీక మాసంలో హిందువులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనటంతో శాకాహారానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయ్యప్ప, భవానీ దీక్షలకు కూడా ఇది సీజన్ కావడంతో కూరగాయలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.

ఏ రకం కూరగాయలు కొనాలనుకున్నా ధరలు చుక్కల్లో ఉండటంతో అన్ని వర్గాల ప్రజలకూ దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్‌లో వంకాయ కేజీ రూ.60 నుంచి 70, టమోటా 40, దోస 25, క్యారెట్ 60, బంగాళాదుంపలు, బీరకాయలు, బెండకాయలు 40 వరకు  పలుకుతున్నాయి. దొండకాయలు ఎన్నడూ లేనిది రూ.70 వరకు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి రూ.25, చిక్కుళ్లు రూ.30, కొత్తిమీర కట్ట చిన్నది రూ.30, చామదుంపలు 40, కంద 30 చొప్పున అమ్ముతున్నారు.
 
పువ్వులు, పండ్ల ధరలూ పైపైకి...

 మార్కెట్‌లో పువ్వులు, పండ్ల ధరలు సైతం పైపైకి ఎగబాకుతున్నాయి. ఒక మోస్తరు సైజున్న బత్తాయిలు డజను రూ.100కు పైబడి అమ్ముతున్నారు. యాపిల్స్ అయితే సామాన్యుడు కొనే పరిస్థితే కనిపించటం లేదు. ఒక్కోటి రూ.40 వరకు పలుకుతోంది. సీతాఫలాలు డజను రూ.200 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. ఇక పూజలకు తప్పనిసరిగా వాడే అరటిపండ్లు సైజును బట్టి డజను రూ.40 నుంచి 50 వరకు పలుకుతున్నారు. భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయని, దీంతో పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు.
 
ధర తగ్గిన చికెన్...

 కార్తీకమాసానికి ముందునుంచే ధర తగ్గిన కోడిమాంసం ఇప్పుడు మరీ చౌకగా మారింది. కార్తీక మాసం ప్రభావంతో చికెన్ వినియోగం తగ్గడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం చికెన్ ధర కేజీ రూ.80కి చేరుకుంది. ఒక్కసారిగా హోల్‌సేల్ రేటు పడిపోవటంతో తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కోళ్లఫారాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు