సంపేత్తాంది..

12 Dec, 2013 03:33 IST|Sakshi
సంపేత్తాంది..

సాక్షి, అనంతపురం : చలి పులి ‘అనంత’ను వణికిస్తోంది. సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి చల్లగాలులు వీస్తుండడంతో బయటకు రావాలంటేనే జనం అల్లాడిపోతున్నారు. వారం క్రితం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 18 డిగ్రీలు నమోదు కాగా.. ప్రస్తుతం 11 డిగ్రీలకు పడిపోయింది.
 
 రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్న జిల్లాలో అనంతపురం కూడా చేరిపోయింది. ప్రతి ఏటా జనవరి మొదటి వారం నుంచి చలి గాలులు ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఏడాది ఉత్తరాంధ్ర, తమిళనాడు, ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో జిల్లాలో కూడా చెప్పకోదగ్గ స్థాయిలోనే వర్షాలు కురిశాయి. దీని ప్రభావం ఎక్కువగా ఉండడంతో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అనంతపురం రోడ్లపై ఎక్కడ చూసినా  స్వెట్టర్లు, జర్కిన్లు, తలకు మంకీ క్యాపులు వేసుకుని తిరుగాడే వారే కనిపిస్తున్నారు. తెల్లవారుజామున లేచి చూసే సరికి నేల అంతా తడిసి ఉంటోంది. మంచుతెరలు కమ్ముకుని ఉంటుండడంతో ప్రజలు చలిమంటల వద్దకు పరుగులు పెడుతున్నారు. రాత్రి వేళ కూడా మంచు కురుస్తోంది. ఉదయం ఎనిమిది గంటలైనా మంచు ప్రభావం వల్ల చలి ఎక్కువగా ఉంటోంది. రాత్రిళ్లు మామూలు దుప్పట్లు చలిని ఆపలేక పోతుండటంతో ఉలన్ దుప్పట్లను కొనుగోలు చేస్తున్నారు. వారం రోజుల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని బుక్కరాయసముద్రం వాతావరణ కేంద్ర శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
 
 చలి కాలం ప్రారంభంలోనే 11 డిగ్రీలకు పడిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. చలిని తట్టుకునేందుకు కంబళ్లు, మందంగా ఉండే దుప్పట్లు, ఇతరత్రా దుస్తులు మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం చలి 11 డిగ్రీలకు చేరుకోవడంతో జనవరి నెలలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఉదయం నుంచి పట్టణాల్లో పలు చిల్లర వ్యాపారులు, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే వారు, ఏ దిక్కూమొక్కూ లేక రోడ్లపై పడుకునే వారు చల్ల గాలులతో అల్లాడిపోతున్నారు.  
 

మరిన్ని వార్తలు