విప్ ధిక్కరిస్తే అనర్హతే

1 Jul, 2014 02:34 IST|Sakshi

గుర్తింపు పార్టీలు విప్ జారీ చేసుకోవచ్చు
 స్పష్టం చేసిన ఎన్నికల సంఘం వర్గాలు


హైదరాబాద్: స్థానిక సంస్థల్లో రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికైన అభ్యర్థులంతా ఆయా పార్టీలు జారీచేసే విప్‌కు అనుగుణంగా ఓటెయ్యాలని, ధిక్కరించే పక్షంలో వారిపై అనర్హత వేటు పడుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూన్ 3న మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక జరగనుంది. వీటితోపాటు జెడ్పీ ఎన్నికల్లోనూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు గుర్తించిన అన్ని రాజకీయ పార్టీలు విప్ జారీ చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ ఎన్నికల్లో విప్ జారీచేసుకునే అధికారం ఉన్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాను ఇదివరకే వెల్లడించామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వెల్లడించారు. విప్ వర్తించదంటూ కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని ఎన్నికల సంఘం వర్గాలు ఖండించాయి. వైఎస్సార్‌సీపీతో సహా గర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నత అధికారి వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు