కోతప...వాత

7 Jun, 2014 00:00 IST|Sakshi
కోతప...వాత

ప్రమాణ స్వీకారం చేయకముందే బాబు పాలన సెగ తగులుతోంది. జిల్లాలో కరెంటు దెబ్బ పరిశ్రమల యజమానులకు షాక్ ఇస్తోంది. పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. పైగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు... పీక్ అవర్స్‌లో విద్యుత్ వినియోగిస్తే భారీ జరిమానా లంటూ భయపెడుతున్నారు. ప్రభుత్వ విధానం పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వందల కోట్ల విలువైన ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది. రాష్ట్రంలో మళ్లీ చీకటి పాలనకు ఇది ఆరంభ సూచకమా..?
 
 సాక్షి, గుంటూరు: పరిశ్రమలకు పవర్‌హాలిడే లేదంటూనే విద్యుత్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ లోటు కారణంగా పరిశ్రమలకు కేటాయించే కరెంటుకు కోత పెడుతున్నారు. ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కేవలం పరిశ్రమలు లైటింగ్ మాత్రమే వాడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. పరిశ్రమల యజమానులు డెడికేటెడ్ ఫీడర్లు ఏర్పాటు చేసుకున్నా, సరఫరా అరకొరగానే ఉంటుందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలకు సీజను. ఈ సమయంలో ఎడాపెడా అమలవుతున్న కోతలతో పరిశ్రమల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ విధిగా హెచ్‌టీ వినియోగదారులకు కోతలు అమలుచేయాల్సిందేనని పీక్ అవర్స్‌లో కరెంటు వినియోగిస్తే భారీ జరిమానా విధించాలని ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.
 
 జిల్లాకు ప్రతి రోజూ 11 మిలియన్ యూనిట్లు కేటాయిస్తున్నారు. జిల్లాలో 973 హెచ్‌టీ సర్వీసులు, ఎల్‌టీ సర్వీసులు 11,324 ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో ఇండస్ట్రియల్ లోడు గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టు కరెంటు కోటా కేటాయించడం లేదు. సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచి ఎస్పీడీసీఎల్‌కు దక్కే వాటా మొన్నటి వరకు 22 శాతం ఉంది. రాష్ట్ర విభజనతో సీపీడీసీఎల్ పరిధిలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను ఎస్పీడీసీఎల్‌లో కలిపారు. రెండు జిల్లాలను కలిపినా కేటాయింపు మాత్రం పెద్దగా పెరగలేదు. వినియోగం ఆధారంగా కేటాయించారని చెబుతున్నా, పారిశ్రామికంగా జిల్లాకు పెద్ద పీట వేయాలని, జిల్లా నుంచే హెచ్‌టీ సర్వీసుల ద్వారా రూ.97 కోట్లు ప్రతి నెలా వసూలవుతోందని పరిశ్రమల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్‌లో కచ్చితంగా ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నా, ఎస్పీడీసీఎల్ పరిశ్రమలకు అందిస్తున్న సేవలు నామమాత్రంగానే ఉంటున్నాయని చెబుతున్నారు. కరెంటు కోతలతో రూ.వందల కోట్లలో ఉత్పత్తులకు ఆటంకాలు ఏర్పడుతున్నట్టు  పలువురు పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ప్రతి ఏడాది కరెంటు కోతలు ఉండవని సమావేశాలు పెట్టి మరీ చెప్పే ఉన్నతాధికారులు ఆచరణకొచ్చేసరికి కోతలు అమలు చేస్తున్నారని వాపోతున్నారు. వ్యవసాయానికి కరెంటు సరఫరా కారణంగానే పరిశ్రమలకు గంటల పాటు కోతలు అమలు చేయాల్సి వస్తోందని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. ప్రతి శుక్రవారం పవర్‌హాలిడే అమలు చేస్తున్నారు. అయితే సరఫరా మెరుగ్గా ఉన్నప్పుడు పవర్‌హాలిడే ఎత్తేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు