ఇందిరమ్మకు విభజన ఎఫెక్ట్

14 May, 2014 03:07 IST|Sakshi

అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు నిలిచి పోయాయి. రెండు నెలల క్రితమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి నేటికీ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు తోడు రాష్ట్ర విభజన కసరత్తు చేస్తుండడంతో రాష్ట్ర విభజనలో భాగంగా సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు అప్పులు, ఆస్తుల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అధికారులు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను నిలుపుదల చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
 
 జిల్లాకు వివిధ దశల కింద 4,50,631 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి దాకా 3,03,328 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 85,769 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 60 వేల ఇళ్ల నిర్మాణాలు మొదలే కాలేదు. కాగా లబ్ధిదారులు గడచిన రెండు నెలల్లో 500 ఇళ్లకు పైకప్పులు వేసుకున్నారు. అయితే బిల్లులు మాత్రం మంజూరు కాలేదు.
 
 రాష్ట్ర కార్యాలయం నుంచే ఆగిన బిల్లులు :
 గతంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు జిల్లా స్థాయిలోనే జరిగేవి. అయితే ఆరు నెలల క్రితం నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యాలయం నుంచి బిల్లులు మం జూరు చేసేలా నూతన విధానాన్ని ప్రవేశ పెట్టారు. అయినప్పటికీ సకాలంలో బిల్లులు అందేవి. రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో నెల రోజులుగా బిల్లులు నిలిచి పోయాయని, ఈ విషయంలో తామేమీ చేయలేమంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
 రూ. 1.50 కోట్ల దాకా పేరుకు పోయిన బిల్లులు:
 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వివిధ దశలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు రూ. 2 కోట్ల దాకా బిల్లులు పేరుకు పోయాయి. గోడల మొదలు పైకప్పు వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు 500 మంది దాకా ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున రూఫ్ కాస్ట్ కింద దాదాపు రూ. 1.50 కోట్లు అందాలి. మరో 15 రోజుల వరకూ కూడా బిల్లుల చెల్లింపులు కొలిక్కి వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్ అందుబాటులోకి రాక పోవడంతో, ఆ శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి వివరణ ఇస్తూ బిల్లులు ఆగిన పోయిన విషయం వాస్తమేనని, ఆ బిల్లులు ఎప్పుడు అందుతాయో స్పష్టంగా చెప్పలేమని అన్నారు.
 

మరిన్ని వార్తలు