ఇంజనీరింగ్‌లో తెలంగాణ.. మెడిసిన్‌లో ఆంధ్రా ఫస్ట్

10 Jun, 2014 02:52 IST|Sakshi

ఎంసెట్ ఫలితాలు, ర్యాంకుల విడుదల  
మెడిసిన్ టాప్ 10లో ఐదుగురు అమ్మాయిలు  
ఇంజనీరింగ్ టాప్-10లో ఒక్క అమ్మాయీ లేదు
నేటి నుంచి వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ జవాబుపత్రాలు  
29 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్  వచ్చే నెల 15 నుంచి మెడికల్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వీటిని విడుదల చేసి ర్యాంకులు, మార్కులను వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకును ఇంజనీరింగ్‌లో తెలంగాణ విద్యార్థి నందిగం పవన్‌కుమార్ సాధించగా, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి గుర్రం సాయిశ్రీనివాస్ సాధించారు. ఇక మెడికల్‌లో టాప్- 10లో ఐదుగురు అమ్మాయిలు ఉండగా, ఇంజనీరింగ్‌లో టాప్-10లో ఒక్క అమ్మాయి కూడా లేదు.
 
 ఎంసెట్ ఫలితాల్లో పార్శదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈసారి విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను ఎంసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర కు అవసరమైన విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్ ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కౌన్సెలింగ్ వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానుంది.
 
 మొత్తం ఫలితాల్లో బాలికలే ఫస్ట్
 -    ఎంసెట్‌లో ఎక్కువమంది బాలికలే అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో 1,66,743 మంది బాలురు పరీక్ష రాయగా, 1,12,577 మంది (67.51శాతం) ర్యాంకులు సాధించారు.
 -    1,00,77 మంది బాలికలు పరీక్ష రాయగా 76,257 మంది (76.19 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు.
 -    అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో 39,107 మంది బాలురు పరీక్ష రాయగా 31,470 మంది (80.47 శాతం) అర్హత సాధించారు.
 -    పరీక్ష రాసిన 67,289 మంది బాలికల్లో 57,017 మంది బాలికలు (84.73 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు.
 
 రెండు రాష్ట్రాల్లో అర్హుల వివరాలివీ..

మరిన్ని వార్తలు