ఇంటక్‌లో నిర్వేదం

23 Nov, 2015 23:33 IST|Sakshi
ఇంటక్‌లో నిర్వేదం

నిస్సహాయ స్థితిలో గుర్తింపు సంఘం
కమిటీల్లో జాప్యంపై కార్యకర్తల్లో అసంతృప్తి
సమస్యలు వినేవారే లేరని కార్మికులు ఆవేదన

 
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌లో ఐఎన్‌టీయూసీకి మొదటి నుంచి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ప్రతిపక్షంలో ఉన్నా, గుర్తింపులో ఉన్నా వారి ఎన్నికల గుర్తు సింహం వలే దుడుకుగా, ఏది శాసిస్తే అది జరిగేలా ఉండేది. ఇటీవల కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి, నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా  కనిపిస్తోంది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ గెలిచి తొమ్మిది నెలలైనప్పటికి కమిటీల నియామకాలు ప్రక్రియ పూర్తికాక పోవడం, గతంలో ఫ్రంట్ హయాంలో యాజమాన్యం ప్రతిపాదించిన వివిధ అంశాలను వ్యతిరేకించిన ఇంటక్ గుర్తింపులోకి వచ్చిన తర్వాత వాటిని అంగీకరించడం ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనియన్‌లో నెలకొన్న ఈ పరిస్థితి పట్ల నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు యూనియన్ స్తబ్దంగా ఉండటంతో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఉందని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

సమస్యలు వినే నాథుడు కరువు?
ఈ ఏడాది ఫిబ్రవరి 14న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఏడేళ్ల తర్వాత ఈ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ మంచి మెజార్టీతో గెలుపొందింది. ఉక్కు యాజమాన్యం నుంచి మే 29న అధికారికంగా గుర్తింపు పత్రాన్ని అందుకున్నారు. తీవ్రమైన జాప్యంతో ఐఎన్‌టీయూసీ నాయకత్వం పీఎఫ్, ఎస్‌బీఎఫ్, సెంట్రల్ సేఫ్టీ కమిటీ, ఉక్కునగరంలోని అంబేద్కర్ కళాక్షేత్రం, ఆంధ్రకేసరి కళాక్షేత్రం, వడ్లపూడి, అగనంపూడి, గంగవరం కమిటీలను పూర్తిచేయగలిగారు. ఉక్కు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అతి ముఖ్యమైన ఉక్కు జనరల్ ఆస్పత్రి, టౌన్ డెవలప్‌మెంట్ కమిటీలకు ఇంతవరకు మోక్షం కలగలేదు. దీని వల్ల ఉక్కు జనరల్ ఆస్పత్రి సమస్యలను వినే నాథుడు లేకుండా పోయారు. ఇక ప్రొడక్షన్, మార్కెటింగ్, సీఎస్‌ఆర్, వెల్ఫేర్ వంటి క మిటీల ఊసేలేదు.

 పరిమితికి మించి సభ్యులను కోరడం వల్లే ?
 చాలా కమిటీలకు పరిమితికి మించి సభ్యులను గుర్తింపు యూనియన్ కోరడంతో అవి పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్నవాటిని తీసుకుని, మిగిలిన వాటిని అడిగి ఉంటే బాగుండేదని గుర్తింపు యూనియన్ నాయకులే వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విధంగా జాప్యం జరగడం వల్ల కార్మికుల్లో అపఖ్యాతి మూటగట్టుకోవడం తప్ప ఒరిగేదేమి లేదంటున్నారు. పుండు మీద కారం చల్లినట్టు యాజమాన్యం ఇటీవల ప్రారంభించిన గేటు నిబంధనలు కార్మికుల్లో మరింత అసంతృప్తి రేకెత్తిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సొంత క్యాడర్‌లో మరింత అసంతృప్తి ప్రబలే అవకాశముంది. తక్షణం కమిటీలు వేయడంతో పాటు జనరల్ ఆస్పత్రి, టౌన్ అడ్మిన్, గేటు సమస్యలపై చర్యలు తీసుకోకపోతే జరిగే నష్టానికి యూనియన్ నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 
 

మరిన్ని వార్తలు