ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం

8 Jun, 2015 02:10 IST|Sakshi
ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం

కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ
మర్రిపాలెం (విశాఖపట్నం):
దేశంలోని ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కల్పించి ఆదర్శవంతమైన కార్మికులుగా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతోందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలో యువతకు ఆయా రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి పాటు పడుతోందని చెప్పారు. కంచరపాలెం దరి ప్రభుత్వ పాత ఐటీఐని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో నైపుణ్యాభివృద్ధి అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. దేశంలో యువతకు ఉపాధి కల్పన కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య పద్ధతిలో ఐటీఐలు అభివృద్ధి చెందడం హర్షణీయమన్నారు.

ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్నారు. తొలుత మంత్రి ఐటీఐలలో ఆయా ట్రేడ్ల భవనాలు సందర్శించారు. ప్రతీ యూనిట్‌లో పరికరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో,  డ్రైవింగ్ కోర్సులో శిక్షణకు వచ్చిన అభ్యర్థులతో మాట్లాడారు. ప్రాంతీయ ఉప సంచాలకులు(అప్రంటీస్) ఎస్.వి.కె.నగేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఐటీఐలో సౌకర్యాలు, శిక్షణను వివరించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ప్రభుత్వం పాత ఐటీఐలో ప్రత్యేక ట్రేడుల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఐఎంసీ చైర్మన్ ప్రభాకరరావు తెలిపారు.

తర్వాత బాలికల ఐటీఐలో ఫ్యాషన్ టెక్నాలజీ శిక్షణకు అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన మెషీన్లను పరిశీలించారు. ఐటీఐలో సదుపాయాల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.   ఈ పర్యటనలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు కె.హరిబాబు, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, పాత ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం.గురునాధేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ బి.కూర్మారావు, నాలుగో జోన్ జోనల్ కమిషనర్ సిహెచ్.నాగనర్సింహారావు, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.పృధ్విరాజ్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు