కర్నూలులో ఈ-టాయ్‌లెట్స్

26 Sep, 2014 00:03 IST|Sakshi
కర్నూలులో ఈ-టాయ్‌లెట్స్

కర్నూలు(జిల్లా పరిషత్): నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ఎలక్ట్రానిక్ బయో టాయ్‌లెట్స్(ఈ-టాయ్‌లెట్స్) ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు స్థానిక రాజవిహార్ సెంటర్ వద్ద ఉన్న బస్టాప్, రైల్వేస్టేషన్‌కు సమీపంలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. అక్టోబర్  మొదటి వారంలో రాజవిహార్ సెంటర్‌లో ఈ-టాయ్‌లెట్ ప్రారంభించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రం సైంటిఫిక్ సొల్యూషన్స్(తివేండ్రం) వారు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టాయ్‌లెట్ ఖరీదు రూ.6లక్షలు. వీటిని ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, వైజాగ్ సిటీల్లో ఏర్పాటు చేశారు. ఈ విధానాన్ని కర్నూలులో ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నారు. ఈ విధానం విజయవంతమైతే మరిన్ని ఈ టాయ్‌లెట్లు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ పీవీవీ సత్యనారాయణమూర్తి చెప్పారు.
 
ఈ-టాయ్‌లెట్స్ పనిచేసే విధానం
ఈ-టాయ్‌లెట్‌లలో వెళ్లాలంటే రూ.5ల నాణేన్ని వేయాలి. నాణెం వేసిన వెంటనే డోర్ తెరుచుకుంటుంది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత బటన్‌ను నొక్కితే ఆటోమేటిక్‌గా శుభ్రం అవుతుంది. ఒకవేళ శుభ్రం చేయకపోయినా బయటకు వచ్చి డోర్ వేసిన వెంటనే ఆటోమేటిక్‌గా టాయ్‌లెట్ శుభ్రపడుతుంది. టాయ్‌లెట్‌లో నీరు అయిపోయినా, ఒకేసారి ఇద్దరు టాయ్‌లెట్‌లోకి వెళ్లినా వెంటనే సంబంధిత సిబ్బందికి మెసేజ్ వెళ్తుంది. వెంటనే సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఈ-టాయ్‌లెట్‌కు ఏర్పా టు చేసిన సెప్టిక్ ట్యాంకులో డీఆర్‌డీఏ వారి సహకారంతో ఇనాకులం అనే పురుగులను వదులుతారు. ఆ పురుగులు సెప్టిక్ ట్యాంకులోని మలినాలను తిని శుభ్రం చేస్తాయి.

మరిన్ని వార్తలు