పీలేరులో దారుణం

30 Mar, 2014 04:27 IST|Sakshi

పీలేరు, న్యూస్‌లైన్:  పీలేరు పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులు బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్టు అటు పోలీసులు, ఇటు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన ఇంటికి ముందు, వెనుకవైపు ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతుండడంతో జన సంచారం అధికంగా ఉంది. అయినప్పటికీ దుండగులు వృద్ధురాలి గొంతుకోసి సొత్తు దోచుకెళ్లడం సంచలనం రేకెత్తిస్తోంది.

 పీలేరు దుర్గానగర్‌లో ఎనిమిదేళ్లుగా శివలింగం, జ్యోతి దంపతులు కాపురం ఉంటున్నారు. ఇరువురూ ఉపాధ్యాయులు. జ్యోతి తల్లి యశోదమ్మ ఇంటి వద్దనే ఉంటున్నారు. శనివారం ఉదయం శివలింగం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గం టలకు జ్యోతి కూడా తలపుల జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం 12.19 గంటలకు 08584-242305 నంబర్ నుంచి శివలింగంకు ఫోన్‌కాల్ వెళ్లింది.  తన పేరు ప్రవీణ్ అని, కలికిరి నుంచి ఫోన్ చేస్తున్నానని తెలిపాడు. కోడ్ నెంబర్ గమనించిన శివలింగం కలికిరి కాదు పీలేరు నుంచే మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. ఎన్ని గంటలకు ఇంటికి వస్తావంటూ మరోమారు ఫోన్‌లో ఆగంతకుడు వాకబు చేశాడు. ఈ ఫోన్‌కాల్‌తో అనుమానం వచ్చిన శివలింగం వెంటనే ఇంటికి వచ్చేశారు.

ఇంటి ముఖద్వారం గేటుకు తాళం వేసి ఉండడంతో అత్తను పిలిచారు. ఆమె పలకక పోవడంతో అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిచి తన అత్త బాత్‌రూములో ఉందేమో చూడమన్నారు. అయితే ఇంటి ముఖ ద్వారం కొద్దిగా తెరచి ఉండడంతో ఇంటిలోకి వెళ్లి పరిశీలించారు. ఓ గది లో రక్తపు మడుగులో అత్త యశోదమ్మ మృతదేహాన్ని చూసి బిగ్గరగా కేకలు వేశారు. భోరున విలపిస్తూ భార్య జ్యోతికి ఫోన్‌ద్వారా విషయం తెలి పారు. అలాగే పీలేరు పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే భారీ సంఖ్యలో జనం సంఘటన స్థలానికి చేరుకున్నారు. పీలేరు సీఐ టి.నరసింహులు, ఎస్‌ఐ సిద్ధతేజ మూర్తి, ఎన్నికల బందోబస్తు నిమిత్తం మదనపల్లెకు వెళ్లడంతో భాకరాపేట ఎస్‌ఐ నెట్టికంఠయ్య ముందుగా సం ఘటన స్థలానికి చేరుకున్నారు. చిత్తూ రు నుంచి వేలిముద్ర నిపుణులు, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని పిలిపించి ఆధారాలు సేకరించారు. పోలీస్ జాగిలం కడప మార్గంలో కొంతదూరం వరకు వచ్చి ఓ కల్వర్టు వద్ద ఆగిపోయింది. అక్కడ లభించిన రెండు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన ఇంటిలో వేలిముద్రలను సేకరించారు.

 శివలిం గంకు వచ్చిన ల్యాండ్‌లైన్ నెంబరుపైనా పోలీసులు కూపీ లాగుతున్నా రు. అనంతరం పీలేరు సీఐ, ఎస్‌ఐ హత్య విషయం తెలుసుకుని ఎన్నికల విధుల నుంచి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులను అడిగి వివరాలు సేకరించారు. పట్టపగలు వృద్ధురాలి ని హతమార్చి 150 గ్రాముల బంగా రు, రూ.35 వేల నగదు దోచుకెళ్లడం సర్వత్రా సంచలనం రేకెత్తించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు