అన్నంలో రాళ్లు, పురుగులు

31 Jul, 2014 03:55 IST|Sakshi
అన్నంలో రాళ్లు, పురుగులు

గజపతినగరం: కస్తూరిబా పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనాన్ని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మాటలు వట్టిమాటలుగానే తేలిపోతున్నాయి. దీనికి ఉదాహరణగా దత్తిరాజేరు మండలంలోని కస్తూరిబా పాఠశాలలో నాశిరకం బియ్యంతో ఉడకని అన్నం తినలేక విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనను చెప్పుకోవచ్చు. ఇక్కడి విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు.

మంగళవారం రాత్రి విద్యాలయంలో నాసిరకం బియ్యంతో వండిన అన్నం తిని విద్యార్థినులు ఎ.సాయి, ఎన్. రుద్రమదేవి, కె. భారతి, కె.నాగమణి, జి.లీల, డి.రమ్య, ఎ.సరస్వతి, సి.హెచ్.సరస్వతి, ఐ.ఆదిలక్ష్మి, ఆర్.పావని, సి.హెచ్. సత్యవ తి, కె.ఆదిలక్ష్మి, టి.సూరితల్లి, జె.గౌరి, వి.కల్యాణి, జి. సాయిరమాదేవి, జి.రామలక్ష్మి, పి.సాయికుమారిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన విద్యాలయం సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను సమీపంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్లి వైద్యసేవలు అందించారు.
 
ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినప్పటికీ గత కొన్ని రోజులుగా వండుతున్న బియ్యం బాగోలేవని తరచూ వాంతులు, కడుపునొప్పి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. బియ్యంలో తెల్లనిరాళ్లు, పురుగులు ఉంటున్నాయని వాటినే వండి పెట్టడంవల్ల అనారోగ్యానికి గురికావాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనిపై ప్రత్యేక అధికారిణి శ్రీదేవి వివరణ కోరగా  నెలరోజుల క్రితమే తాను విధులకు వచ్చానని బియ్యంలో రాళ్లు, తెల్లని పురుగులు ఉన్నాయని వాటిని తిరిగి పంపించడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. విషయాన్ని  ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లానని తెలిపారు. ఇటువం టి సంఘటనలు పునరావృతం కాకుండా  జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు