ఆయనొద్దు

6 Nov, 2013 02:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డికి టీడీపీ తీర్థం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించడం విభేదాలకు దారితీసింది. మూడు దశాబ్దాలుగా టీడీపీ వర్గీయులను వేధించిన జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ ఆ పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరం నాగిరెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళి.. ఇటీవల హైదరాబాద్‌లో చంద్రబాబును నిలదీసినట్లు సమాచారం.
 
 ఆర్థిక అవసరాలను తీర్చుతానని జేసీ ప్రభాకర్‌రెడ్డి హామీ ఇవ్వడం వల్లే పార్టీలోకి తీసుకుంటున్నామని.. సహకరించాలని పేరం, కందిగోపులను చంద్రబాబు అనునయించే యత్నం చేశారని తెలిసింది. తాడిపత్రి శాసనసభ అభ్యర్థిత్వం తనకే కేటాయించాలన్న డిమాండ్‌కు చంద్రబాబు అంగీకరించడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి పేరం అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కానీ.. పేరం, చంద్రబాబు నిర్ణయాలను తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళి తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.  


ఈ నెల 9వ తేదీన జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరాలని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు జేసీ వర్గీయులు వెల్లడించారు. ఇది పసిగట్ట డంతోనే పేరం నాగిరెడ్డి, కందిగోపుల మురళి తమ వర్గీయులతో ఇటీవల హైదరాబాద్‌కు తరలివెళ్లారు. మూడు దశాబ్దాలుగా టీడీపీ శ్రేణులను వేధించి, హత్యా రాజకీయాలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి పార్టీ తీర్థం ఎలా ఇస్తారని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల వద్ద కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది.
 
 జేసీ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటే టీడీపీకి సామూహికంగా రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారట. పార్టీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. ఆర్థిక అవసరాలు తీర్చుతానని జేసీ ప్రభాకర్‌రెడ్డి హామీ ఇవ్వడం వల్లే పార్టీలోకి చేర్చుకుంటున్నామని చంద్రబాబు, లోకేష్.. పేరం, కందిగోపులను అనుయించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలని పేరం నాగిరెడ్డి పట్టుబట్టారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించడంతో పేరం నాగిరెడ్డి సంతృప్తి చెందినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
 
 కానీ.. దీనిపై కందిగోపుల మురళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు దశాబ్దాలుగా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలను అంతమొందించిన జేసీ కుటుంబీకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా శ్రేణులకు ఎలాంటి సంకేతాలు పంపుతారని కందిగోపుల తీవ్ర స్థాయిలో నిలదీసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కందిగోపులను పేరం అనునయిస్తూ.. తాడిపత్రిలో ఏర్పాటు చేసిన ఎన్టీయార్ విగ్రహాష్కరణకు రావాలని చంద్రబాబును ఆహ్వానించగా, జేసీ ప్రభాకర్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకునే అంశం తేల్చకుండా తాడిపత్రికి రాలేనని చంద్రబాబు స్పష్టీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
 
 కాగా, తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ పేరం నాగిరెడ్డికి ఇస్తామన్న చంద్రబాబు హామీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి భగ్గుమంటున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, రాయదుర్గం నుంచి దీపక్‌రెడ్డి, అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి తాను టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అంగీకరిస్తేనే పార్టీ తీర్థం పుచ్చుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి..  చంద్రబాబు తనయుడు లోకేష్‌కు తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఇందుకు చంద్రబాబు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో టీడీపీలో చేరే ముహూర్తాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు