మహిళ హత్య కేసులో యావజ్జీవం

26 May, 2015 03:06 IST|Sakshi

హిందూపురం : పెనుకొండ మండలం అమ్మవారిపల్లికి చెందిన సుశీలమ్మ(60) అనే మహిళను హత్య చేసి.. నగలు, డబ్బు అపహరించిన కేసులో రొద్దం మండలం సానిపల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు(45)కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ మేరకు హిందూపురం జిల్లా అదనపు న్యాయమూర్తి డి.రాములు సోమవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వపరాలిలా ఉన్నాయి. సుశీలమ్మ అనంతపురంలోని రాజేశ్వరి రెసిడెన్సీలో నివాసముంటూ స్వగ్రామం అమ్మవారిపల్లిలో వ్యవసాయ పొలాలను చూసుకొనేందుకు వచ్చి వెళ్లేది. 2011 నవంబర్ 11న పొలం పనుల నిమిత్తం వచ్చిన ఆమె అనంతపురం తిరిగి వెళ్లలేదు.
 
 మరుసటి రోజు జాతీయ రహదారి సమీపాన గల తిమ్మాపురం వద్ద ముళ్లపొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికుడు వీరభద్రప్ప గుర్తించాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికివేసి..కాల్చివేశారు. దీంతో అతను వీఆర్‌ఓ చలపతికి సమాచారమిచ్చారు. వీఆర్‌ఓ పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హత్య కేసు (క్రైమ్ నంబర్ 169/2011) నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసులు.. సుశీలమ్మను ద్విచక్ర వాహనంపై పొలం వైపు తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారమిచ్చారు.
 
 దీంతో పోలీసులు అతన్ని విచారించారు. నగలు, డబ్బు కోసం ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ కేసులో 27 మంది సాక్షులను కోర్టు విచారించింది. నేరం రుజువు కావడంతో  శ్రీనివాసులుకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండేళ్లు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు