అంతా అంతర్ముఖులే...

20 Jan, 2016 00:08 IST|Sakshi
అంతా అంతర్ముఖులే...

ఒంటరి జీవనమే వారి నైజం
ఇరుగు పొరుగుకు దూరం
తల్లీకుమారుల ఆత్మహత్య ఉదంతంలో అంతుపట్టని కారణాలు

 
అక్కయ్యపాలెం : విపరీత మానసిక ధోరణే రామచంద్రానగర్‌లో నివసిస్తున్న కమల, రవికుమార్‌ల ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరి మృతికి గల కారణాలు పోలీసులకు సైతం అంతుచిక్కడం లేదు. చనిపోయిన మాచర్ల కమల మానసిక పరిస్థితి సరిగా లేదని చుట్టుప్రక్కల వారు చెప్పినట్టు తెలిసింది. కుటుంబంలోని వారంతా నిత్యం ఇంటిలోనే ఉండేవారని, కిటికీలకు కర్టెన్లు వేసుకొని ఎవరికీ కనిపించే వారు కాదని తెలిసింది. అలాగే  ఉదయం ఒక టిఫిన్ ప్యాకెట్ , మరల రాత్రి 10 గంటల సమయంలో మరో టిఫిన్ ప్యాక్ తీసుకువెళ్లేవారని, వాటితోనే సరిపెట్టుకునే వారని తెలిసింది. రామచంద్రానగర్‌లో 20 ఏళ్ళుగా నివసిస్తున్నా కనీసం ప్రక్క ఇంటివారితో కూడా  మాట్లాడేవారు కాదని, ఒంటరి జీవనం సాగించేవారని చెబుతున్నారు. మృతురాలు కమల అన్నయ్య కోటిన హరిప్రసాద్ నక్కవానిపాలెంలో ఉంటున్నారు. అతనితో కూడా సంబంధాలు లేవని, ఎస్‌ఐ ఫోన్ చేయగా చనిపోయారని తెలిసిందని హరిప్రసాద్ చెప్పడం విశేషం. గతంలో పెద్ద కొడుకు చనిపోయినప్పుడు కూడా పోలీసులే సమాచారం ఇచ్చారన్నారు.
 
వడ్డీయే ఆధారం...
 మృతుల కుటుంబంలో ఎవరూ ఎటువంటి పని చేయడం లేదు. అంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇంటి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గొడౌన్ కూడా కొంత కాలంగా అద్దెకు ఇవ్వడం మానేశారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.10 లక్షలకు నెల నెలా వచ్చే వడ్డీతోనే కాలం వెల్లబుచ్చుతున్నట్టు తెలిసింది.
 
రక్త సంబంధీకులు లేరు...
మృతుల పోస్టుమార్టం కోసం ఐదుగురు పెద్దమనుషులు, ఇద్దరు రక్త సంబంధీకులు అవసరం. అయితే మృతుల తరపున బంధువులుగాని, చుట్టుప్రక్కలవారు గానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించడం పోలీసులకు సమస్యగా మారింది. భార్య, కొడుకు చనిపోవడంతో ఒంటరి అయిన ఇంటి పెద్ద మహేశ్వరరావును పోలీసులు కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. ఇంటి లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు కదా మరి ఎక్కడ ఉంటావని అడిగితే ఫర్లేదు ఎవరు మిగిలిపోతాం...ఉన్నన్నాళ్ళు ఆ ఇంటిలోనే ఉంటానని మహేశ్వరరావు ధీమాగా చెబుతున్నాడు. అయితే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడన్న అనుమానంతో మహేశ్వరరావును ఒక హోటల్‌లో ఉంచి పోలీసు కాపలా ఉంచారు.  టీసీఎస్‌లో పనిచేసి మానేసిన చిన్నకొడుకు రవికుమార్ కూడా ఆత్మహత్యకు పాల్పడడానికి సరైన కారణాలు పోలీసులకు అంతు చిక్కడం లేదు.  పోస్టుమార్టం పూర్తి కాగా మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మహేశ్వరరావుకు అప్పగించారు.
 

>
మరిన్ని వార్తలు