గ్రామీణుల హృదయాల్లో.. చెదరని ‘సంత'కం

7 Nov, 2014 03:35 IST|Sakshi
గ్రామీణుల హృదయాల్లో.. చెదరని ‘సంత'కం

పల్లె సీమల జీవన చిత్రానికి ప్రతి రూపాలు సంతలు.. గ్రామీణుల ఆత్మీయ అనురాగాలకు అవి ప్రతీకలు ..  ‘ఏం సుబ్బన్న మామా.. ఇప్పుడేనా రాటం...బాగున్నావా.... అవును నాగిరెడ్డి ఎద్దలకు మూతి సిక్యాలు కావాలని ఇటొచ్చా.. ఏం రట్నమ్మక్క కూరగాయలు బాగా కాస్సాండాయా... ఏం బాల్లిడ్డి బావ ఎర్రగడ్డలు ఏందీ ఇంత అద్దుమానంగా రేట్లు తగ్గినాయ్..’ అంటూ ఆ పల్లె జనాల పలకరింపులు హృదయానికి హత్తుకుంటాయి. అనుబంధాలను తెలిపే ఆ సంభాషణలు వినసొంపుగా ఉంటాయి. ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చినా..  పల్లె సంతల ముందు బలాదూరే. అందుకే అవి పల్లె ప్రజల హృదయాల్లో చెక్కు చెదరని ‘సంత’కాలుగా నిలిచిపోయాయి.
 
  కడప అగ్రికల్చర్
  జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి సంతలు కొనసాగుతూనే ఉన్నాయి.  వారపు సంత సమయం వచ్చిందంటే చాలు ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. సంచులు తీసుకుని సంతలకు గ్రామీణులు వెళుతుండడం కనిపిస్తుంది.  బొట్టు బిళ్ల నుంచి సబ్బు బిళ్ల వరకు.. తాజా కూరగాయలు.. నాటుకోళ్లు అబ్బో సంతల ప్రత్యేకతే వేరు.
 
  అన్నీ దొరుకుతాయి..
 వ్యవసాయానికి పనిముట్లు, ఇంటి అవసరాలకు వాడే సరుకులు అన్నీ ఈ సంతల్లో  లభిస్తాయి. అలాగే వ్యవసాయ ఉత్పత్తులక్రయ విక్రయాలు కూడా ఈ సంతల్లో చేస్తారు. దళారీలు లేకుండా నేరుగా రైతులు, వ్యాపారులు ధరలను చర్చించుకుని, నిర్ణయించుకుని అమ్మకాలు చేసుకుంటారు. దీంతో కొనుగోలుదారులకు చౌకగా వస్తువులు లభించడంతోపాటు,ఆయా గ్రామ పంచాయితీలకు కూడా ఆదాయం వస్తోంది.
 
 సూపర్ మార్కెట్‌లు ఎన్ని వచ్చినా ..
 ప్రపంచీకరణ నేపథ్యంలో హైటెక్ హంగులతో, కలర్‌ఫుల్ లైట్లతో చూపరులను కనువిందు చేసే సూపర్ మార్కెట్‌లు గ్రామాలకు సమీపంలోని పట్టణాల్లో వెలిశాయి. వాటిల్లో ఎన్ని వస్తువులున్నా అవన్నీ గ్రామీణులకు అందుబాటులో ఉండే ధరలు కావు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపై అక్కడ ట్యాక్స్ వేస్తారు. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే సంతల్లో ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవు, అక్కడి సంతల్లో  ఏ అంగడివారి ధర వారిదే తక్కువ ధరకు సరుకులు లభిస్తాయనే నమ్మకం గ్రామ ప్రజల్లో బలంగా ఉంటుంది.  


 బొట్టు బిళ్ల నుంచి సబ్బు బిళ్ల వరకు, గృహాల్లో వాడే నిత్యావసరాలన్నీ ఒకే చోట వారంలో ఒకరోజు మాత్రమే లభిస్తాయి. ఎన్ని సూపర్ మార్కెట్‌లు వచ్చినా సంతలు ప్రాభవాన్ని నేటికి కోల్పోకపోవడం విశేషమే కదూ.

మరిన్ని వార్తలు