పచ్చ నేతలకు మళ్లీ ఉపాధి!

23 Feb, 2016 23:16 IST|Sakshi

నీరు-చెట్టు పనులు పునఃప్రారంభం
గతంలో అక్రమంగా మట్టి అమ్మకాలు
రూ.కోట్లు దండుకున్న టీడీపీ శ్రేణులు
మళ్లీ అదే సీన్!

 
మట్టిదొంగలకు మళ్లీ చేతినిండాపని దొరికింది.  ఏడు నెలల పాటు నిలిచిన నీరు-చెట్టు పనులు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం ఊపందుకోవడంతో మట్టికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇంకా చెరువుల్లో నీరు ఉండగానే పనులకు శ్రీకారం చుట్టారు. ఏదో విధంగా మట్టిని వెలికి తీసి అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు అధికార టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. గతేడాది జరిగిన నీరు-చెట్టు పనుల్లో సుమారు 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీయగా.. దాంట్లో 80 శాతం మట్టి పచ్చ నేతల జేబులు నింపింది. మళ్లీ అదే సీన్ రిపీట్ కానుంది.
 
విశాఖపట్నం: జిల్లాలో నీరు-చెట్టు కింద 100 ఎకరాలకు పైబడిన ఆయకట్టు ఉన్న మీడియం ఇరిగేషన్ టాంక్స్ (చెరువులు)లో పూడిక తీత పనులను ఇరిగేషన శాఖకు అప్పగించారు. ఈ విధంగా జిల్లాలో 236 చెరువులుంటే 2014 డిసెంబర్‌లో తొలి విడతలో రూ.4.97 కోట్ల అంచనాలతో 23 చెరువులకు, రెండో విడతలో రూ.18.30కోట్లతో మరో 69 చెరువుల్లో పూడికతీత పనులకు పరిపాలనామోదం ఇచ్చారు. ఇలా రెండు విడతల్లో 92 పనులు రూ.23.27కోట్లతో చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇరిగేషన్ శాఖాధికారుల నిర్లక్ష్య ఫలితంగా పనులు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరిగింది.
 
నామమాత్రంగా
జిల్లాలో కేవలం 73 చెరువుల పనులు ప్రారంభమైనప్పటికీ  పది చెరువుల్లో కనీసం ఐదుశాతం పనులు కూడా జరగలేదు. మరో ఐదు చెరువుల్లో 20 శాతం  పనులు మాత్రమే జరగడంతో  వీటికి ఎలాంటి చెల్లింపులు చేయలేదు. మిగిలిన 58 చెరువుల్లో ఐదు చెరువుల్లో మాత్రం నూరు శాతం పనులు పూర్తయ్యాయి.  53 చెరువుల్లో 30 నుంచి 40 శాతం మేర పనులు జరగ్గా ఆ మేరకు చెల్లింపులు జరిపారు. ఈ విధంగా జిల్లాలో రూ.14.36కోట్లు 58 చెరువుల్లో పనులు చేపట్టగా పూర్తయిన పనులకు రూ.4.59కోట్ల మేర చెల్లింపులు జరిపారు. అధికారిక లెక్కల ప్రకారం 13.86 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక (మట్టి) వెలికితీసినట్టు లెక్కలు చెబుతుండగా అనధికారికంగా 18 నుంచి 20లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వేశారు.

నిబంధనలు గాలికి..
ఈ మట్టిని పూర్తిగా స్థానిక అవసరాలకే  ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, శ్మశానాలు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, రైతు పొలంగట్లు ఎత్తుచేసేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంది.  స్థానిక సంస్థలకు సీనరేజ్ చెల్లించి వచ్చిన ప్రతి ఒక్కరికి వారు కోరుకున్న స్థాయిలో మట్టిని ఇచ్చామని చెప్పు కొస్తున్నారు. జన్మభూమి కమిటీల పర్యవేక్షణలో జరిగిన ఈ పనుల్లో వెలికి తీసిన మట్టిలో 80 శాతం మట్టి టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ మట్టిని ఎలా వినియోగించారో చెప్పాల్సిందిగా కోరితే మాత్రం అధికారులు లెక్కలు చూపలేకపోయారు. కాని మట్టి అంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు తరలిపోయింది. ఈ మట్టి, గ్రావెల్ అక్రమ అమ్మకాల ద్వారా  రూ.10 కోట్లకు ైపైగా చేతులు మారినట్టు తెలుస్తోంది. జూన్‌లో కురిసిన వర్షాల నేపథ్యంలో నిలిచిన నీరుచెట్టు పనులు మళ్లీ ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడు చెరువుల్లో పూడిక పనులు ప్రారంభమయ్యాయని ఎస్‌ఈ నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన చెరువుల్లో పూడిక తీత పనులను కూడా ఈ వారంలో పూర్తి స్థాయిలో పునఃప్రారంభిస్తామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు