ఏఎస్‌ఐ ఆధ్వర్యంలో పునరుద్ధరణ కార్యక్రమాలు

16 Dec, 2016 03:25 IST|Sakshi
ఏఎస్‌ఐ ఆధ్వర్యంలో పునరుద్ధరణ కార్యక్రమాలు

►  త్వరలో ఉప్పుగుండూరు బుద్ధ స్థూపం పనులు ప్రారంభం
► మోటుపల్లిలో నంది విగ్రహం చోరీపై పోలీసులకు ఫిర్యాదు
► ఒంగోలులో పురావస్తు ప్రదర్శనశాలకు స్థలం కోసం కృషి  
► ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కన్సర్వేషన్ అసిస్టెంట్‌ అన్నంబొట్ల వెంకటేశ్వరరావు


ఒంగోలు కల్చరల్‌: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ)  ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కన్సర్వేషన్ అసిస్టెంట్‌ అన్నంబొట్ల వెంకటేశ్వరరావు వెల్లడించారు. గురువారం ఆయన సంస్థ కార్యక్రమాల గురించి ’సాక్షి’తో మాట్లాడారు. ఏఎస్‌ఐ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప్పుగుండూరు, మోటుపల్లి, కనపర్తి, సత్యవోలు, పిటికాయగుళ్ల, భైరవకోన ఉన్నాయన్నారు.  పూసలపాడులో తవ్వకాలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు.  ఉప్పుగుండూరు–చిన్నగంజాం మధ్య కొమ్మమూరు కాలువ సమీపంలోని బౌద్ధ స్థూపానికి సంబంధించిన పనులను త్వరలో పునః ప్రారంభిస్తామన్నారు. ముందుగా అక్కడ ఒక షెడ్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

బాపట్ల భావన్నారాయణస్వామి ఆలయ గాలి గోపురం పనులతోపాటు తమ శాఖ ఆధ్వర్యంలో ఉదయగిరి కోట జీరో్ణద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలోని భైరవకోనలో టాయిలెట్‌ బ్లాక్‌ను నిర్మించామన్నారు. ఒంగోలులో తమ శాఖకు  జిల్లా అధికార యంత్రాంగం స్థలం కేటాయిస్తే ఆర్కియలాజికల్‌ మ్యూజియం నిర్మించే ందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

జిల్లాలో పురావస్తు శాఖ తవ్వకాలలో లభ్యమైన విగ్రహాలను, ఇతర చారిత్రక ఆధారాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దీనివల్ల అవకాశం కలుగుతుందన్నారు. ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయాలను, పురావస్తు ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను పరిరక్షించడం తమ లక్ష్యమని తెలిపారు. చిన్నగంజాం మండలం మోటుపల్లి వీరభద్రస్వామి ఆలయ మండపంలో ఈ నెల 12న అపహరణకు గురైన నంది విగ్రహం గురించి చిన్నగంజాం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.ఆలయాల్లో విగ్రహాల అపహరణ, గుప్తనిధుల ముఠాల  ఆగడాలకు అడ్డుకట్ట వేసే విషయంలో పోలీసు యంత్రాంగంతోపాటు ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని మరింతగా అందజేయాలని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు