ఆగని దందా

3 Nov, 2014 02:19 IST|Sakshi

అనంతపురం కార్పొరేషన్ : ఒకసారి రుచి మరిగితే ఇక దానికి అంతే ఉండదు. సరిగ్గా ఇదే పరిస్థితి యాడికి సబ్‌రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్) కార్యాలయంలో కనిపిస్త్తోంది. అడ్డగోలు రిజిస్ట్రేషన్ల దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని ఎస్‌ఆర్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు కూడా ఇక్కడ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇక్కడి అవినీతిపై చేపట్టిన విచారణ కూడా పక్కదారిన పట్టినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే... జిల్లాలో అనంతపురం, హిందూపురం జిల్లా రిజి స్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. యాడికి ఎస్‌ఆర్ అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌలభ్యం ఉంది. అయితే ఏ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోనివి అదే జిల్లా ఎస్‌ఆర్‌లో చేసుకోవచ్చు. అంతే తప్ప ఇతర జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని వాటిని మరొక జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని ఎస్‌ఆర్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు ఉండదు. అయితే యాడికి ఎస్‌ఆర్‌లో ఇదే తరహా దందా సాగుతోంది.

హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని ఎస్‌ఆర్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్నాయి. ఇదొక ఎత్తయితే అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని ఎస్‌ఆర్‌లకు సంబంధించినవి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. జిల్లాలోని రెండు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 22 ఎస్‌ఆర్‌లు ఉంటే యాడికి ఎస్‌ఆర్‌లో మాత్రమే ఇలాంటి మతలబు వ్యవహారం నడుస్తున్నట్లు ఆ శాఖ వర్గాలే అంటున్నాయి. ఇలా అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఆగస్టులో మొదలైంది.

ఆ నెలలో హిందూపురం డీఆర్ పరిధిలోని ఎస్‌ఆర్‌లు, అనంతపురం డీఆర్ పరిధిలోని ఎస్‌ఆర్‌లకు సంబంధించి 123 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగింది.   సెప్టెంబరులో హిందూపురం డీఆర్ పరిధి లోని ఎస్‌ఆర్‌లకు సంబంధించి 40, అనంతపురం డీఆర్ పరిధిలోని ఎస్‌ఆర్‌లకు సంబంధించి 179 డాక్యుమెంట్లు జరిగాయి. దీనిపై గతంలోనే ఆ శాఖ డీఐజీ కె.అబ్రహం విచారణకు ఆదేశించారు.

ఆయన వేసిన విచారణ కూడా పక్కదారి పట్టిందనేందుకు యాడికి ఎస్‌ఆర్‌లో అక్టోబర్‌లోనూ భారీగా రిజిస్ట్రేషన్లు జరగడమే నిదర్శనం.  గత  నెల 29వ తేదీ వరకు 107 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలిసింది. ఇందులో హిందూపురం డీఆర్ పరిధిలోని ఎస్‌ఆర్‌లకు సంబంధించి 27 ఉన్నాయి. అనంతపురం డీఆర్ పరిధిలోని ఎస్‌ఆర్‌లకు సంబంధించి 80 డాక్యుమెంట్లు రిజిస్ట్రార్ అయినట్లు సమాచారం.

 హిందూపురం డీఆర్ పరిధిలోనివి ఇలా :
 హిందూపురం డీఆర్ పరిధిలోని ఐదు ఎస్‌ఆర్‌లకు సంబంధించి 27 డాక్యుమెంట్లు యాడికి ఎస్‌ఆర్‌లో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలిసింది. చిలమత్తూరు ఎస్‌ఆర్‌కి సంబంధించి 13 డాక్యుమెంట్లు, చెన్నేకొత్తపల్లికి ఎస్‌ఆర్‌కి సంబంధించి 3, హిందూపురం ఎస్‌ఆర్‌కి సంబంధించి 6, మడకశిర ఎస్‌ఆర్‌కి 3, పెనుకొండ ఎస్‌ఆర్‌కి సంబంధించి 2 డాక్యుమెంట్లు రిజిస్ట్రర్ అయినట్లు తెలిసింది.

 విచారణ నివేదిక అందగానే చర్యలు
 యాడికిలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై విచారణకు ఆదేశించాం. హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ పెద్దన్న విచారణ నిర్వహిస్తున్నారు. నివేదిక అందిన తరువాత దాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాము.
 - కె.అబ్రహాం, డీఐజీ, రిజిస్ట్రేషన్ శాఖ
 
 రిజిస్ట్రేషన్లు ఇలా
 
 ఎస్‌ఆర్                సెప్టెంబరు        అక్టోబరు
 బుక్కపట్నం                2              -
 చిలమత్తూరు            13            13
 చెన్నేకొత్తపల్లి                2             3
 ధర్మవరం                     2               -
 గుత్తి                          33           13
 గుంతకల్లు                 23               -
 హిందూపురం               3              6
 కళ్యాణదుర్గం                1              4
 పెనుకొండ                  18              2
 పామిడి                       2               4
 శింగనమల                 7                1
 తాడిపత్రి                    53             24
 అనంతపురం(ఆర్‌ఓ)  28            17
 అనంతపురం రూరల్  32            17
 మడకశిర                   -                3
 మొత్తం                   219          107

మరిన్ని వార్తలు